Shopping Malls | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్‌కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా షాపింగ్ మాల్స్‌ను ఏర్పాటు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2027 నాటికి దేశీయంగా ఏడు మెట్రో నగరాల్లో షాపింగ్ మాల్స్‌కు డిమాండ్ 43 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదని జేఎల్ఎల్ ఇండియా తాజాగా వెల్లడించింది. ‘ఇండియా రిటైల్: ఎవాల్వింగ్ టూ ఏ న్యూ డాన్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత్‌లో షాపింగ్ మాల్స్‌కు ఉన్న డిమాండ్‌ను విశ్లేషించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ల్లో 89 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ ఉండగా…వచ్చే ఐదేండ్లలో కొత్తగా 38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి.
వీటిలో దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే 28 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్స్ ఉండగా..2027 నాటికి కొత్తగా 11.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్ రాబోతున్నాయని పేర్కొంది. అలాగే బెంగళూరులో 4.97 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 6.23 చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 5.48 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతాలో 2.98 మిలియన్ చదరపు అడుగుల మాల్స్ రాబోతున్నాయని పేర్కొంది. ఆర్థిక రాజధాని ముంబైలో 2.5 మిలియన్ చదరపు అడుగుల విస్థీర్ణంలో షాపింగ్ మాల్స్ రాబోతుండగా..అదే పుణెలో 2.32 మిలియన్ చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. దేశీయ రిటైల్ రంగం దినదినాభివృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా కస్టమర్లకు నూతన షాపింగ్ అనుభవం కల్పించడానికి మాల్స్ యాజమానులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని జేఎల్ఎల్ ఇండియా హెడ్ రాహుల్ అరోరా తెలిపారు.