పెద్దఅడిశర్లపల్లి, జనవరి 11 : వేసవిలో జంటనగరాలకు తాగునీటి సరఫరాపై ప్రత్యామ్నాయాన్ని కనుగొనేందుకు జలమండలి అధికారులు శనివారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సందర్శించారు. ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ మామాంక్ మిట్టల్, డైరెక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో జలమండలి అధికారులు పంప్‌హౌస్, సిస్టర్న్, లింక్ కెనాల్‌ను పరిశీలించారు. సిస్టర్న్ లీకేజీలతోపాటు లింక్ కెనాల్ లైనింగ్ పనులు చేపడితే జంటనగరాలకు తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ వారికి వివరించారు.
ప్రస్తుతం జంటనగరాలకు ఒక మోటర్ ద్వారా నీటిని విడుదల చేస్తూ పనులు కొనసాగించాలని జలమండలి అధికారులు సూచించగా అది సాధ్యం కాదని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పారు. ఏఎమ్మార్పీ నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసుకున్నా 510 అడుగులకు దిగువన సాగర్ నీటి మట్టం తగ్గితేగానీ మోటర్లు నడపడం సాధ్యం కాదని వారికి వివరించారు. దాంతో జంటనగరాలకు శాశ్వత పరిష్కారం సుంకిశాల అనే అభిప్రాయానికి జలమండలి అధికారులు వచ్చిన్నట్టు తెలిసింది. వారి వెంట డీఈ నాగయ్య, జేఈ శ్రావణ్ ఉన్నారు.