ఖైరతాబాద్, జనవరి 28 : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాలలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జీ చెన్నయ్య హితవు పలికారు. లేకుం టే తమ సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు మాలలకు దక్కాల్సిన ఫలితాలన్నీ మాదిగలే అనుభవించారని ఆరోపించారు.
వర్గీకరణ ఆగదని ఒకసారి, మాలలే అడ్డుకుంటున్నారని మరోసారి మా ట్లాడడం తగదని, మంద కృష్ణకు దమ్ముంటే ప్రధానితో ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టించుకొని వర్గీకరణ అమలుచేయించుకోవాలని సూచించారు. ఆయన మాదిగ వర్గాలకు నాయకుడిగా కాకుండా, బీజేపీకి తొత్తుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాలలపై చావుడప్పు కొడుతానంటున్న మంద కృష్ణ.. ముందుగా పార్లమెంట్లో బిల్లు పెట్టని బీజేపీ అధిష్టానంపై కొట్టాలని ధ్వజమెత్తారు. సమావేశంలో చెరుకు రాంచందర్, కరణం కిషన్ పాల్గొన్నారు.