హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ చదివితే ఉద్యోగం ఖాయమనే నమ్మకం క్రమంగా సన్నగిల్లుతున్నది. జీవితంలో స్థిరపడొచ్చన్న భావనకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే ఇదే బోధపడుతున్నది. ఐటీ రంగంలో మందగమనం, ఆర్థిక అనిశ్చితి, ఏఐ ప్రభావం, కంపెనీల వ్యయ నియంత్రణ చర్యలతో బీటెక్ ప్లేస్‌మెంట్స్ సంక్షోభంలో పడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. కేవలం టాప్, ప్రముఖ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే అంతో ఇంతో ప్లేస్‌మెంట్స్ దక్కించుకోగా, మిగిలిన కాలేజీలు, గ్రామీణ కాలేజీల్లోని విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్యాకేజీలు కూడా నిరాశనకంగానే ఉన్నాయి.
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలుగా ఉండే వార్షిక వేతన ప్యాకేజీలు గణనీయంగా తగ్గాయి. కొన్ని కాలేజీల్లో సగటు వేతన ప్యాకేజీ రూ.8 లక్షలుగా ఉన్నది. కొది మంది ఫ్రెషర్స్‌కు మాత్రమే ప్రారంభ వేతనాలు రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటున్నాయి. కొన్ని, కంపెనీలైతే ఇంటర్న్‌షిప్ ఆధారిత నియామకాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాలుగేండ్లపాటు లక్షలు ఖర్చు చేసి చదివిన విద్యార్థుల్లో ఉద్యోగ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నది.
గతంలో వందల సంఖ్యలో విద్యార్థులను రిక్రూట్ చేసుకున్న కంపెనీలు ఏఐ ప్రభావంతో వెనక్కి తగ్గాయి. కొత్త రిక్రూట్‌మెంట్స్‌ను వాయిదావేస్తున్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో ఫ్రెషర్స్‌ను నియమించుకున్న కంపెనీలు మాస్ హైరింగ్ తగ్గించుకున్నాయి. చాలా పరిమిత నియామకాలకే మొగ్గు చూపుతున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. దీంతో సగటు విద్యార్థికి క్యాంపస్ ఉద్యోగం దకడం కష్టమవుతున్నది. ప్లేస్‌మెంట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు రావడంలేదు. చిన్నా చితక కంపెనీలే వస్తున్నాయి. ఈ ఏడాది ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమెజాన్, ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌ను నిర్వహించలేదు. చిన్నా చితక కంపెనీలు మాత్రమే విద్యార్థులను రిక్రూట్ చేసుకొనేందుకు ఆసక్తి చూపించాయి. సేయింట్ మేరీ ఇంజినీరింగ్ కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో ప్లేస్‌మెంట్స్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నది. రిక్రూట్మెంట్ డ్రైవ్స్ దాదాపు ముగిశాయి. కంపెనీలు స్కిల్స్ ఉన్నవారు, అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారినే ఎంపికచేసుకున్నాయి. కొద్దిమంది విద్యార్థులకే భారీ ప్యాకేజీలు దక్కాయి. పలు కంపెనీలు క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించినా ఎంపికలు చాలా తకువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఓ కాలేజీలో సీఎస్ఈ కోర్సు పూర్తిచేసిన 160 మంది రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఎదుర్కొంటే పట్టుమని పది మంది కూడా ఉద్యోగాలు దక్కించుకోలేదు. కంపెనీలు మారుల కంటే ఏఐ, కోడింగ్, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారిని పరీక్షించి రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ నైపుణ్యాలు లేని వారికి, కేవలం పట్టాలు సాధించిన వారికి తిప్పలు తప్పడం లేదు. ఫలితంగా విద్యార్థులు అదనపు నైపుణ్యాలు సంపాదించేందుకు, కోడింగ్ వంటి వాటిపై పట్టు సాధించేందుకు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌ల ట్రెండ్ నడుస్తున్నది. కంపెనీలు ఇంటర్న్‌లుగా తీసుకొని తమకు కావాల్సినవిధంగా మలుచుకుంటున్నాయి. ప్లేస్‌మెంట్స్ విషయానికి వస్తే, టాప్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల పట్ల ఆసక్తి చూపడం లేదు. మిగిలిన కంపెనీలు స్కిల్స్ ఉన్నవారినే రిక్రూట్ చేసుకొంటున్నాయి.
– ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఐటీ రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రతికూల ప్రభావాలు రిక్రూట్మెంట్పై పడ్డాయి. ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకొనే విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగేస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ కాస్త తగ్గిన మాట వాస్తవం. ఈ సమస్య మా కాలేజీల్లోనే కాదు.. అన్ని కాలేజీల్లోనూ ఉన్నది. సాంకేతికత మారినప్పుడల్లా ఏదో ఒక కుదుపునకు గురికావడం, ట్రెండ్ మారడం సహజమైంది.
– వరప్రసాద్‌రెడ్డి, హోలిమేరీ ఇంజినీరింగ్ కాలేజీ చైర్మన్