హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గొలుసుకట్టు విధానంలో అధిక లాభాలు ఆశజూపి, సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ అధికారులు మంగళవారం జప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ కంపెనీ రూ.158.14 కోట్ల మొత్తాన్ని ఖాతాదారుల నుంచి సేకరించి ఎగవేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఏపీలోని మొత్తం 12 పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ చట్టాల కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. పక్కా ఆధారాలతో మైత్రి ప్లాంటేషన్ అండ్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోపాటు అదే గ్రూపునకు చెందిన శ్రీనక్షత్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైత్రి రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవ్‌రెడ్డి, కొలికపూడి బ్రహ్మారెడ్డికి చెందిన మొత్తం 210 స్థిరాస్థులను ఈడీ అధికారులు జప్తు చేశారు. జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.110 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తుల్లో 196 భూములు ఆంధ్రప్రదేశ్‌లో, 13 భూములు తెలంగాణలో, ఒకటి కర్ణాటకలో ఉన్నట్టు తెలిపారు.