హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేస్తారా? లేదా?, వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయిస్తారా? లేదా? కాంగ్రెస్ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదబాద్‌లోని తన నివాసంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో ఫూలే విగ్రహ ఏర్పాటును కోరుతూ.. భారత జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 10 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. 12న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో బీసీ జన గణన చేపట్టాలని విన్నవించారు. కులగణన చేపట్టకపోతే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ 11 లోపు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రియాంక గాంధీ ఏ ప్రొటోకాల్‌లో ఉన్నారు?
రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వపరమైన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఏ హోదాలో పాల్గొంటారని కవిత ప్రశ్నించారు. ‘ఆమె కనీసం ఏ ఒక గ్రామం నుంచి సర్పంచ్‌గా గెలిచిందా? ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచారా? రాష్ట్రం లో ఏ ప్రొటోకాల్‌లో అయినా ఉందా? మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకురాలైతే ఇంటికి పిలుచుకొని మీ మనువడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి.
కానీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని పిలుస్తామంటే నల్లబుగ్గలు ఎగరేసి నిరసన తెలియజేస్తాం’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ ప్రజాధానాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏమిటని నిలదీశారు. వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక విమానాలకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
జై తెలంగాణ అనలేదు
కేసీఆర్‌ను తిట్టడం తప్ప తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు ఏం పనిచేస్తున్నారని కవిత ప్రశ్నించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు సోనియా కాళ్లుమొక్కిన రేవంత్.. జై సోనియమ్మ అన్నారు తప్ప ‘జై తెలంగాణ’ అని నినదించలేదని విమర్శించారు. అమరవీరులకు ఒకసారి కూడా నివాళి అర్పించలేదని, అమరజ్యోతికి వెళ్లలేదని, అటువంటి వ్యక్తి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు.
ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరమే లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని, ఆ పార్టీ నాయకులే పడగొడుతారని కవిత స్పష్టంచేశారు. నల్లగొం డ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని పడగొడుతారని చెప్పారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండమన్నారని, తాము ప్రతిపక్షంలోనే ఉంటామని తేల్చిచెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని, బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు రోజులు గడుస్తున్నా సీఎం స్పందించకపోవ డం దారుణమన్నారు.
కేసీఆర్ నినాదం.. ప్రజల వద్దకే పాలన
ఇచ్చిన ఏ ఒక హామీని కూడా నెరవేర్చని రేవంత్‌ను తెలంగాణ ప్రజలంతా యూ-టర్న్ సీఎంగా పిలుస్తున్నట్టు కవిత చెప్పారు. ప్రజాదర్బార్ పెట్టి రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన రేవంత్ కేవలం ఆరోజు ఒక గంట మాత్రమే ప్రజలను కలిశారని.. ఇప్పుడు మంత్రులు.. అధికారులు వెళ్తున్నారని చెప్పా రు. ఆ తాకిడి తట్టుకోలేక మళ్లీ జిల్లాల్లోనే ప్రజాపాలన పెడతామని ప్రకటించి.. కేసీఆర్ ఆచరించిన ప్రజల వద్దకే పాలన నినాదంలోకి వచ్చారని తెలిపారు.
వందరోజుల తర్వాతే.. మీ వంద పాపాలు..
శిశుపాలుడి వంద పాపాలు పండినట్లు వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా నిలదీస్తామని కవిత తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అం శంపై పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా అని వ్యాఖ్యానించారు. సమావేశంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు, మేడె రాజీవ్‌సాగర్, యునైటెడ్ పూలే ఫ్రంట్ నేత గట్టు రామచందర్‌రావు పాల్గొన్నారు.
ఇది కుటుంబ పాలన కాదా?
కాంగ్రెస్ నాయకులు పొద్దస్తమానం కేసీఆర్ కుటుంబపాలన చేశారని అంటున్నార ని, కానీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన 22 కుటుంబాలు ఆయా పదవులను అనుభవిస్తున్నారని కవిత ఆగ్ర హం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 22 కుటుంబాలకు చెందిన నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
గడ్డం వినోద్, వివేక్ సోదరులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరులు, తండ్రీకొడుకులైన మైనంపల్లి హనుమంతరావు, రోహిత్‌రావు, భార్యాభర్తలైన ఉత్తమ్, పద్మావతిరెడ్డి, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కుమారుడు జువ్వా డి నరసింగారెడ్డి, ఆయన కుటుంబ సభ్యడు కూచాడి శ్రీహరిరావు, మాజీ స్పీకర్ శ్రీపాదరావు కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు మనుమడు వొడితెల ప్రణవ్, మాజీ మంత్రి రాజనరసింహ కుమారుడు దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె పీ విజయారెడ్డి, కాంగ్రెస్ జాతీయ నేత పవన్ ఖేరా భార్య కోట నీలి మ, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి మనువరాలు చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర ళీ భార్య కొండా సురేఖ, మాజీ ఎంపీలు మల్లు అనంతరాములు, మల్లు రవిల సోదరుడు మల్లు భట్టి విక్రమార, ఇప్పుడాయన భార్య నందిని.. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి, పట్లోళ్ల సంజీవరెడ్డి వంటి అనేక కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందని వివరించారు.