Speed Post | తపాలా శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. కాల్ లెటర్‌ను సరైన సమయంలో అందజేయకపోవడంతో ఇంటర్వ్యూకు హాజరుకాలేకపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బి. నాగరాజు బీఎస్సీ చదివాడు. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లో ఒక ఉద్యోగం పడితే దానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే ఉద్యోగం ఉండటంతో దానికి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ చాలామందిని దాటుకుని ఇంటర్వ్యూకు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అధికారులు సెప్టెంబర్ 4వ తేదీన స్పీడ్ పోస్టులో కాల్ లెటర్ పంపించారు.
తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నుంచి వచ్చిన ఆ కాల్ లెటర్‌ను నాగరాజుకు అందించడంలో పోస్టల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. సెప్టెంబర్ 4వ తేదీన స్పీడ్ పోస్టు బుక్ చేస్తే.. అక్టోబర్ 4వ తేదీన డెలివరీ చేశారు. కానీ అప్పటికే ఇంటర్వ్యూలు పూర్తవ్వడంతో నాగరాజు ఉద్యోగాన్ని కోల్పోయాడు. పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఉద్యోగాన్ని కోల్పోయానని ఆవేదన చెందాడు. వెంటనే తన దగ్గరలోని పోస్టాఫీసు దగ్గరికి వెళ్లి నిలదీశాడు. కానీ దానికి పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాకు 4వ తేదీనే లెటర్ వచ్చింది.. అప్పుడే ఇచ్చేశామంటూ ఏమీ పట్టనట్టగా ప్రవర్తించారు.