హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి (Food Poison) 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పాఠశాల హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం బాపురెడ్డిని సస్పెండ్ చేసింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని టర్మినేట్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 15 మంది విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉన్నదని, వారికి మహబూబ్నగర్ పెద్ద దవాఖానాలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం మాగనూర్ జెడ్పీహెచ్లో మిడ్డే మీల్స్ వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్ను స్కూల్కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విద్యార్థులను మక్తల్ ఏరియా దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని మహబూబ్నగర్లో పెద్ద దవాఖానాకు తరలించారు. బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. భోజనం తిన్న కాసేపటికే విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఫుడ్పాయిజన్ కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి, ఇండ్లకు వెళ్లాలని సూచించారని, వెళ్లిన వారిలో చాలా మంది ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని తోటి విద్యార్థులు తెలిపారు.