రవీంద్రభారతి, ఫిబ్రవరి 14 : అమరుల త్యాగఫలమే ఎస్సీ వర్గీకరణకు అమోదమని, అమరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే వారి త్యాగాలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ అమరుల కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాదిగ అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటితోపాటు రూ.50 లక్షలు ప్రకటించి అండగా నిలువాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపినా మంద కృష్ణమాదిగ అమరుల కుటుంబాలను పరామర్శించకపోవడంపై జాతి ఆయనను క్షమించదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన దండోరా ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులపై పెట్టిన కేసులను తక్షణమే కొట్టివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ అమరుల స్మారక స్థూపం ఏర్పాటుకు హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం స్థలం కేటాయించి స్మారక మ్యూజియం నెలకొల్పాలని కోరారు. మార్చి 1న అన్ని రాజీకీయ పార్టీలను ఆహ్వానించి మాదిగ అమరుల సంస్మరణ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. అమరుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో పొన్నాల సురేందర్ తల్లిదండ్రులు పొన్నాల యాదయ్య, గంగమ్మ, మహేశ్ తల్లిదండ్రులు అంజయ్య, బంగారు శ్రీను, సంఘం నాయకులు పొట్టపెంజర రమేశ్, కృష్ణ, శాంతికిరణ్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.