‘రాష్ట్రంలోకి కొత్త లిక్కర్ బ్రాండ్ల’ను తెస్తున్రటగా అన్నా.. అవును. తమ్మీ.. ‘సోం’ అనే కంపెనీకి రేవంత్ సర్కారు అనుమతి ఇచ్చిందట. ఆ కంపెనీలో పూర్తిగా కల్తీ మద్యమే తయారవుతదటగదనే.. గదే అంటున్రు.. అది తాగే మధ్యప్రదేశ్‌లో కొందరు చనిపోయిన్రట కదా పన్ను ఎగవేత, అవినీతి తదితర ఆరోపణలు గిట్ల ఉన్నయట కూడా.. మరి గట్లాంటి కంపెనీకి మన తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ ఎట్ల ఇస్తరే?!!
రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్ ‘సోం’కు అనుమతులనిచ్చినట్టు వార్తలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. అసలేమిటీ కంపెనీ? నడిపిస్తున్నదెవరు? నిజంగా ఈ కంపెనీని వివాదాలు చుట్టుముట్టాయా??
Som Distilleries | (స్పెషల్ టాస్క్ బ్యూరో) భోపాల్, మే 28 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీశ్‌కుమార్ అరోరా (జేకే అరోరా) తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, ఇదే సమయంలో కంపెనీ మూలాలను రక్షించుకోడానికి ప్రధాన పార్టీల నేతలందరితో సఖ్యతతో ఉంటారని పేర్కొంటున్నారు. అవసరమైనప్పుడు రాజకీయ పార్టీలకు పెద్దయెత్తున ముడుపులను సమర్పించుకొంటారని సమాచారం.
1980లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జేకే అరోరా ఓ చిన్న మద్యం వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించారు. సన్నిహితుల ద్వారా అప్పటి జనతా పార్టీ కీలక నేతలకు దగ్గరయ్యారు. అప్పటికే కేడియా ఫ్యామిలీ ఆఫ్ కంపెనీస్ మధ్యప్రదేశ్ మద్యం వ్యాపారంలో తిరుగులేనిదిగా చక్రం తిప్పుతున్నది. 1980వ దశకం చివర్లో బీజేపీ నుంచి సుందర్‌లాల్ పట్వా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఆయనతో సాన్నిహిత్యం ఉన్న అరోరా.. ప్రభుత్వ అండదండలతో భోపాల్‌లో లిక్కర్ దుకాణాలను తెరిచారు. సోం గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ పేరిట మద్యాన్ని రిటైలర్లకు సరఫరా చేసేవారు. 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా సీఎంగా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆరోరాకు దిగ్విజయ్తోనూ సాన్నిహిత్యం ఉండటంతో లిక్కర్ పాలసీ విధివిధానాలను అరోరానే రూపొందించినట్టు చెప్తారు. మధ్యప్రదేశ్వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తన బ్రాండ్ బీర్లు, విస్కీ, రమ్ము మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తంకాగా, ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తితో అరోరా కొంత వెనక్కి తగ్గారు.
రాజకీయ నేతల అండదండలతో బీజేపీ, కాంగ్రెస్‌పాలిత 23 రాష్ర్టాలు, యూటీల్లో ‘సోం కంపెనీ మద్యం’ ఏరులై పారే స్థాయికి చేరుకొన్నది. భోపాల్‌లో సోం కంపెనీ ఏర్పాటుచేసిన దేశంలోనే తొలి స్పిరిట్ పోర్ట్‌ఫోలియోలో మద్యం నాణ్యతా ప్రమాణాలు గాలిలో కలిసిపోయాయి. డబ్బులకు ఆశపడి కల్తీ మద్యాన్ని ఈ ప్లాంట్లలో తయారు చేయడంతో 2021లో మధ్యప్రదేశ్‌లో 24 మంది మృత్యువాత పడ్డట్టు జాతీయ హిందీ పత్రిక ‘దైనిక్ భాస్కర్’ ఓ కథనంలో వెల్లడించింది. దీని ఫలితంగానే ప్లాంట్‌ను సీజ్ చేసినట్టు వివరించింది. గుజరాత్‌లోనూ ఈ మద్యాన్ని తాగి మరికొందరు మరణించినట్టు ఆరోపణలున్నాయి. ‘సోం’ మద్యం నాణ్యత విషయంలో ఫిర్యాదులు అందడంతో ఇటీవలే మధ్యప్రదేశ్ సర్కారు ఆ కంపెనీకి నోటీసులను ఇచ్చింది. ఇక పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ‘సోం’ కంపెనీకి కొత్తకాదు. స్థానిక పత్రికల నుంచి రాయిటర్స్ వంటి అంతర్జాతీయ పత్రికలవరకూ ఈ ఎగవేత, అక్రమాలకు సంబంధించిన కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ 2021లో సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్‌పై దాడులు జరిపింది. ధరల నిర్ధారణ, సిండికేట్ తదితర వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీసీఐ అధికారులు సోం డిస్టిలరీస్ సంస్థపై దాడులు చేశారు.
సీఎం నుంచి స్థానిక కౌన్సిలర్ వరకూ అందరితో మంచిగా ఉండేందుకు గుట్టుచప్పుడు కాకుండా ముడుపులను లక్షిత పార్టీకి, నేతలకు చేరవేయడంలో ‘సోం’ నిర్వాహకులది అందెవేసిన చెయ్యిగా చెప్తారు. పార్టీల ఎన్నికల ప్రచారానికి స్పాన్సర్షిప్, నేతలకు గిఫ్ట్‌ల రూపంలో ఇండ్లు, బంగారం, భూములను ఎవరికీ తెలియకుండా చేరవేయడం ‘సోం’ స్పెషాలిటీ. అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల ఫండింగ్లోనూ ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్టు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బట్టి అర్థమవుతున్నది.