హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణా శాఖ కమిషనర్ శ్రీనివాసరాజుతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని, పాత లారీలకు గ్రీన్‌ట్యాక్స్ తగ్గించాలని, ఓవర్‌లోడ్‌తో నడిపే డ్రైవర్ల లైసెన్స్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని, పంచాయతీ, మున్సిపల్ పరిధిలో లారీల రవాణా రుసుము లేకుండా చూడాలని కోరారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. నాలుగురోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారని ప్రతినిధులు పేర్కొన్నారు.
లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని, మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి తొలుత అసోసియేషన్ తరఫున మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్లు వేయాలని భావించినా, మంత్రి కేటీఆర్ హామీతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని అసోసియేషన్ ప్రతినిధులు నందారెడ్డి, యాదయ్యగౌడ్ చెప్పారు.