e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News తంగేళ్లు దాటని బియ్యం మూటలు

తంగేళ్లు దాటని బియ్యం మూటలు

  • కోటలు దాటే గోయల్‌ మాటలు
  • గోదాముల వద్ద లారీల పడిగాపులు
  • బియ్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం.. ప్రైవేటు గోదాములకు మంగళం
  • రెండు ఎఫ్‌సీఐ గోదాములూ ఫుల్‌.. కావాల్సిన వ్యాగన్లు 40.. వస్తున్నవి 15
  • తగ్గిన మిల్లింగ్‌.. తిరకాసు డెడ్‌లైన్‌.. రాష్ట్రం మీద నెపం మోపుతున్న కేంద్రం

నోరు నవ్వితే నొసలు వెక్కిరించిందట. బియ్యం సేకరణపై కేంద్రం మాట్లాడుతున్న అచ్చికాలకూ, బుచ్చికాలకూ ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రావాల్సిన బియ్యం రావడం లేదని కేంద్రమంత్రి గోయల్‌ అక్కడ పార్లమెంటు సాక్షిగా దబాయిస్తాడు. కానీ తీసుకోవాల్సిన బియ్యం తీసుకోడానికి ఇక్కడ ఎఫ్‌సీఐ కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నది. రైతులను, మిల్లులను, లారీలవాళ్లను ఆగమాగం చేస్తున్నది. కావాలంటే నల్లగొండ జిల్లాలో జరుగుతున్న తతంగం చూడండి. అంతా తేటతెల్లమవుతుంది.

నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ): ‘ఖరీఫ్‌ సీజన్‌లోనూ, రబీ సీజన్‌లోనూ ఇస్తామన్న బియ్యాన్ని సరఫరా చేయలేకపోయారు. ఇప్పటికీ తెలంగాణ నుంచి మాకు 29 లక్షల టన్నుల ముడి బియ్యం, 17 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం రావాల్సి ఉంది. తెలంగాణ తగిన నిల్వలను సరఫరా చేయలేకపోయింది.’ ఇవి సాక్షాత్తు పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం ఏమిటో మీరే చదవండి.. ఒక్క నల్లగొండ జిల్లాను ఉదాహరణగా తీసుకొని పరిశీలిస్తే.. విస్మయానికి గురిచేసే తంతు సాగుతున్నది. ఎఫ్‌సీఐ వైఖరే బియ్యం సేకరణకు తీవ్ర విఘాతమని స్పష్టం అవుతున్నది. ఎప్పటిలాగే ప్రైవేటు గోదాములను తీసుకోకుండా ఉన్న గోదాములను ఫుల్‌గా నింపి, అవసరమైన రైల్వేర్యాక్‌లను రప్పించకుండా, బియ్యం లారీలను దిగుమతి చేయకుండా ఎంతో నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నది. జిల్లాలో ఎఫ్‌సీఐ రోజూ సక్రమంగా బియ్యం సేకరిస్తే 8 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసే సామర్థ్యం జిల్లాలోని 110 మిల్లులకు ఉన్నది. కానీ ఎఫ్‌సీఐ నిర్వాకం వల్ల మూడువేల టన్నులు మించి మిల్లులను నడుపలేకపోతున్నారు. స్థలం, ర్యాకుల సమస్య అని నాన్చడం వల్ల మిల్లర్లకు తీవ్రనష్టం వస్తున్నది. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక వరి దిగుబడితోపాటు నాలుగైదు సీజన్లలో వేగంగా సీఎంఆర్‌ పూర్తిచేసిన నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలించింది. ఇందులో సీఎంఆర్‌ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని తేలిపోయింది. పూర్తిగా ఎఫ్‌సీఐ వైఫల్యం, నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ నెల 31 వరకు మాత్రమే బియ్యాన్ని సేకరిస్తామని డెడ్‌లైన్లు విధించి.. తెచ్చిన బియ్యాన్ని తీసుకోకుండా సతాయిస్తున్నది.

- Advertisement -

నల్లగొండ జిల్లాలో యాసంగిలో మొత్తం 8,52,172 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. దాని నుంచి 5,79,476 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి కానున్నది. దీన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం సేకరించాల్సి ఉన్నది. ఇప్పటివరకు 63 శాతం.. అంటే 3,65,023 మెట్రిక్‌ టన్నులను మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకొన్నది. ఇంకా 2,14,453 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తీసుకోవాల్సి ఉన్నది. అది కూడా జిల్లా అధికారులు రోజూ వెంటపడితేనే.

ఎఫ్‌సీఐ నిర్వహణ వైఫల్యం

కేంద్రం బియ్యం సేకరణ ఒక విషవలయంలా తయారైంది. నల్లగొండ జిల్లాలో ఉన్న రెండు గోదాములకు అదనంగా జిల్లాలోని అనిశెట్టి దుప్పలపల్లి, కుక్కడం, కొండమల్లేపల్లి, చిలుకమర్రి, మిర్యాలగూడ ప్రాంతాల్లోని లక్షటన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను లీజుకు తీసుకునేవారు. వాటిని ఈసారి పక్కన పెట్టారు. గొంతెమ్మ నిబంధనలతో నల్లగొండ జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ప్రైవేటు గోదాం కూడా లీజుకు ముందుకు రాలేదు. నల్లగొండ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించాలంటే నెలకు కనీసం 40 రైల్వే వ్యాగన్లు అవసరం. ప్రస్తుతం నెలకు 15 వ్యాగన్లు మాత్రమే జిల్లాకు వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి త్వరగా ఇండెంట్లు వచ్చేలా ఎఫ్‌సీఐ డీఎం నిత్యం పర్యవేక్షణ జరపాలి. ఎఫ్‌సీఐ, రైల్వేశాఖతో సంప్రదింపులు జరిపి వ్యాగన్లు రప్పించేందుకు కృషి చేయకపోవడం దురదృష్టం. కేంద్రం ఈ నెల 31 వరకే సీఎంఆర్‌ను సేకరిస్తామని డెడ్‌లైన్‌ విధించింది. సేకరణలో నిర్లక్ష్యం వహిస్తూ మరోవైపు డెడ్‌లైన్‌ పెట్టడం అంటే ఇబ్బందులు పెట్టడం కాక మరేమిటి?

సగం కూడా పూర్తిచేయలేం

నెలకు 40 రైల్వే వ్యాగన్లు అవసరం ఉంటే.. 15 నుంచి 20 వరకే ఇస్తున్నారు. బియ్యం సేకరణ ఇలానే జరిగితే ఎఫ్‌సీఐ విధించిన గడువు డిసెంబర్‌ 31 వరకు సగం కూడా పూర్తిచేయలేం.

వీ వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారి, నల్లగొండ

మూడ్రోజులుగా పడిగాపులు

బాయిల్డ్‌ రైస్‌ లారీని నకిరేకల్‌ మిల్లు నుంచి దిగుమతికి మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గోదాముల వద్దకు తీసుకొచ్చాం. మూడ్రోజులుగా దిగుమతి కాక ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. నాకంటే ముందు 40 లారీలు సీరియల్‌లో ఉన్నాయి. ఇవ్వాళ మరో 10 లారీలు వచ్చాయి. ఎవరూ పట్టించుకుంటలేరు.

అల్లి లింగయ్య, లారీ డ్రైవర్‌, నకిరేకల్‌

తిండి తిప్పలు ఇక్కడే

నాలుగు రోజులుగా లారీలు ఆపి ఇక్కడే వండుకొని తింటున్నాం. లారీ వద్దే పండుకొంటున్నాం. ఇక్కడే ఉండడంతో ఎక్కువ లోడ్‌లు తోలలేకపోతున్నాం. లారీలు అధికంగా ఉన్నాయి. నా లారీ ఎప్పుడు దిగుమతి అవుతుందో తెలుస్తలేదు.

అంజయ్య, లారీ డ్రైవర్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement