కంటేశ్వర్ డిసెంబర్ 17 : నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న లలిత కాంప్లెక్స్ షాప్ రెండర్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ జిల్లాలో చర్చకు దారి తీసింది. మురికి కాలువ(Sewer) మరమ్మతుల కోసం మున్సిపాల్ సిబ్బంది గత 8 నెలల క్రితం జేసీబీ ద్వారా పనులు చేపట్టి ఇప్పటివరకు దాన్ని పూడ్చలేదని, ఈ సందర్భంగా మురికి కాలువను సరి చేయమని లలిత కాంప్లెక్స్ షాప్ రెంటల్స్ అందరూ కలిసి మున్సిపాలిటీ సిబ్బందికి ,ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు.
అయినప్పటికి ఎటువంటి స్పందన రాలేదని మురికి కాలువ నుండి వచ్చే దుర్వాసన, విపరీతంగా పెరుగుతున్న దోమల ద్వారా కాంప్లెక్స్ వాళ్లందరూ అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని తమ సమస్యను పరిష్కరించే నాధుడే కరువాయాలని కాంప్లెక్స్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్ పక్కనే ఉన్ మురికి కాలువను చూసుకుంటూ ఎన్నోసార్లు ప్రయాణం చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, ఎంపీలకు సమస్య దృష్టికి రావడం లేదని, సమస్య తీరడం లేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. కాగా, ఫ్లెక్సీలు చూసిన వారంతా సమస్య ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే కాదని నగరం మొత్తం మురికి రోడ్ల పైన గుంతలు, ఎత్తు పెరిగిన మాన్ హోల్స్ తో పట్టణంలో ప్రతి చోట సమస్యలు ఎదురవుతున్నాయని, పట్టించుకునే వారే లేరని చర్చించుకోవడం గమనార్హం.