హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15, (నమస్తే తెలంగాణ): రాఖీ కట్టిన అన్న అరుదైన వ్యాధి బారిన పడితే, తన మూలకణాలు దానం చేసి బతికించుకుంది చిన్నారి చెల్లె. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడు(11) అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నాడు. కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణురాలు చందన ఆధ్వర్యంలో ఆ పిల్లాడికి వైద్యం అందించారు.
వైద్యపరీక్షల అనంతరం బాలుడికి అప్లాస్టిక్ ఎనీమియాగా గుర్తించారు. బంధువులెవరైనా మూలకణాలు ఇస్తే నయం చేయొచ్చని వైద్యులు సూచించారు. ఆ పిల్లాడికి మూలకణాలు ఇచ్చేందుకు తన చెల్లెలు ముందుకొచ్చింది. వైద్యులు ఆమె మూలకణాలు సేకరించి, బాలుడికి వైద్యం అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు.
పూర్తిస్థాయిలో మూలకణాలు సరిపోలక పోయినా(హాఫ్ మ్యాచ్) చికిత్స అందించినట్టు చెప్పారు. అతి తక్కువ మందిలో మాత్రమే ఈ వ్యాధి కనిపిస్తుందని వైద్యులు వివరించారు. చికిత్స సమయంలో బాలుడిలోని ధైర్యమే చికిత్సకు సహకరించిందని తెలిపారు. తాను బడికి వెళ్లి చదువుకోవాలని, ఆడుకోవాలని పిల్లాడు పదేపదే చెప్పేవాడని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లాడే ధైర్యం చెప్పినట్టుగా తెలిపారు.