హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మద్యం ధరలు మరోసారి పెరుగనున్నాయి. రాష్ట్రంలో లికర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగులీడర్గా ముఖ్యనేతతో చేస్తున్న లాబీయింగ్ తుది దశకు చేరినట్టు తెలిసింది. చీప్ లికర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లికర్ ప్రాథమిక ధర (ఇష్యూ ప్రైస్) మీద 18 శాతం పెంచడానికి మౌఖిక హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నదని ఏజెన్సీలు చెప్తున్నయి.ఇటీవలి కాలంలో బీరు ధరలు పెంచిన రేవంత్రెడ్డి ప్రభుత్వం తాజాగా బ్రాందీ, విసీ, సాచ్, రమ్ ధరలు పెంచాలని నిర్ణయించింది.
ప్రభుత్యం నియమించిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ వ్యాపారులతో మాట్లాడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నది. వ్యాపారుల తరపున ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే వ్యవహారం నడిపినట్టు తెలిసింది. ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగానే మద్యం ధరల పెంపు మీద తుది కసరత్తు చేసినట్టు సమాచారం. న్యాయపరమైన చికులు తలెత్తకుండా ఉండటం కోసం ధరల నిర్ణయాల కమిటీ 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. మధ్యే మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 శాతం పెంచటానికి అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్టు తెలిసింది. మద్యం సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం లికర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. జూలై ఒకటి నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి, డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్స్, సప్లయ్ కంపెనీలతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచి, ఆ వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.