తెలంగాణలో కొత్త తరహా మద్యం దందాకు తెరలేచిందా? డిమాండ్ ఉన్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం తెలంగాణలో కూడా కనమరుగు కానుందా? ఇకపై కొందరు పెద్దలకు కమీషన్ వచ్చే బ్రాండ్ల మద్యం మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తున్నది. ఇందుకు ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న మద్యం కృత్రిమ కొరతే సాక్ష్యం అంటున్నారు.
మన పొరుగు రాష్ట్రంలో చేసినట్టుగానే తెలంగాణలో కూడా కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు కొందరు పెద్దలు అనధికారికంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారని ప్రచారం జరుగుతున్నది. ఈ కొత్త తరహా మద్యం దందా ఎన్నికల ఫలితాల తర్వాతే మొదలు కానుందని విశ్వసనీయంగా తెలిసింది.
Telangana | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): జూన్ 4వ తేదీ తర్వాత తెలంగాణలో కొన్ని ప్రముఖ లిక్కర్, బీర్ బ్రాండ్లు కనుమరుగు కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ రాష్ట్రంలో చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే బీర్లకు సంబంధించి నోస్టాక్ బోర్డులు వెలిశాయి. గత వారం పదిరోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులో లేవు. దీనికంతటికీ కారణం ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా, అనధికారికంగా రచించిన కొత్త మద్యం దందానే అని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్లు మద్యం లభించడం లేదు.. ఎక్కడ చూసినా నోస్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, ఓడ్కా, వైన్ వంటివి తయారు చేసే ప్రముఖ బ్రాండ్లు ప్రస్తుతం మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా అందుబాటులో లేని బ్రాండ్లలో కేఎఫ్‌సీ స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజర్, ఆఫీసర్స్ చాయిస్, కర్జూరా, కూల్బర్గ్, 5000, రాయల్‌స్టాగ్, టోబర్గ్ వంటివి ఉన్నాయి. మద్యం కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా, ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపి, కావాలనే కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నట్టు తెలిసింది. దీనివెనుక మద్యం సరఫరాలో ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న ఓ మంత్రి తమ్ముడి హస్తం ఉన్నదని తెలిసింది. మద్యం దుకాణాలు బేవరేజ్ కార్పొరేషన్‌కు చలాన్లు కట్టినా, ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయడంలో విముఖత చూపుతున్నారని సమాచారం. అయితే, డిమాండ్ దృష్ట్యా ఇండెంట్లు ఒక బ్రాండ్‌కు పెడుతుంటే.. వారు కావాలని మరొక బ్రాండ్ సప్లయ్ చేస్తున్నట్టు తెలిసింది. మద్యానికి బానిసైన వ్యక్తికి నాలుగైదు రోజుల పాటు అతను తాగే బ్రాండ్‌ను ఆపేస్తే.. ఇక అతనితో ఏదైనా తాగించవచ్చనే కుయుక్తులు పన్నుతున్నారు.
కమీషన్ ఇచ్చే బ్రాండ్లకే ప్రమోషన్
తెలంగాణలో అనధికారికంగా రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం తమకు అధికశాతం కమీషన్ ఇచ్చిన బ్రాండ్లకే ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలుపనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇటు బీర్లు, అటు ఆల్కహాల్ బ్రాండ్ల కృత్రిమ కొరత సృష్టించారని స్పష్టంగా అర్థమవుతున్నదని పరిశీలకులు చెప్తున్నారు. తమ బ్రాండ్ మద్యం జనాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా కమీషన్ చెల్లించాల్సిన పరిస్థితి. ఈ వ్యూహంలో భాగంగానే కొత్త మద్యం బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెడతారని తెలిసింది. ఈ కొత్త బ్రాండ్ల ఎంట్రీలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కమీషన్ ఇస్తే వారి సరుకుకే ప్రమోషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అనధికారిక నియంత్రణ, కమీషన్ల ద్వారా ఒక్కో ఏడాదికి సుమారు రూ.5వేల కోట్ల నగదు చేతులు మారుతుందని మద్యం వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో ఓ రాజకీయ నాయకుడి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. పనిలో పనిగా మద్యం ధరలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో నాడు డిమాండ్‌కు తగ్గ సప్లయ్
తెలంగాణలో పుట్టుక నుంచి చావు వరకూ కార్యక్రమం ఏదైనా ‘మందు’ ఉండాల్సిందే. తెలంగాణలో గత ప్రభుత్వాలు డిమాండ్‌కు తగ్గట్టు జాగ్రత్తగా సప్లయ్ చేశాయి. బీఆర్ఎస్ హయాంలో ఓ క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలకు పరిమితులు విధించి, నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన మద్యాన్ని విక్రయించారు. ఎక్సైజ్‌శాఖకు సైతం అమ్మకాలు, కొనుగోళ్లు, డిమాండ్‌కు తగిన సప్లయ్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టకుండా ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. కాగా ఎన్నికల వేళ మద్యం డిమాండ్ అత్యధికంగా ఉండటంతో కొందరు ప్రభుత్వ పెద్దలకు ఇదొక అక్రమార్జన మార్గంగా కనిపించింది. దీంతో కావాలనే కొన్ని ఆల్కహాల్ బ్రాండ్లను తొక్కిపెడుతున్నారు. అనధికారికంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ కొత్త విధానంతో ఉత్పత్తి చేసేవారు, డిస్ట్రిబ్యూట్ చేసేవారు, విక్రయించేవారు అంతా సిండికేట్ అయితే.. ఇక అడ్డూ అదుపు ఉండదని మద్యం వ్యాపారులే చర్చించుకుంటున్నారు.