హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): మీ వాహనంపై ఐదుకు మించి పెండింగ్ చలాన్లు ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త! వాటిని సకాలంలో చెల్లించకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధానం త్వరలోనే రాబోతున్నది. చలాన్లను 45 రోజులకు చెల్లించకపోతే వాహనం సీజ్ చేస్తారు. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ ‘సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989’లో పలు కీలక సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ము సాయిదాను తాజాగా విడుదల చేసి ంది. ముసాయిదాపై వాహనదారుల అభిప్రాయాలను స్వీకరిస్తున్నది. ము సాయిదాలో పేర్కొన్న నిబంధనలను పరిశీలిస్తే వాహనదారులు ట్రాఫిక్ రూ ల్స్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించింది.
నిబంధనల ఉల్లంఘించినప్పుఉ విధించే చలాన్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. డిజిటల్ మానిటరింగ్ అమలు చేయనున్నట్టు స్పష్టంచేసింది. చలాన్లను గడువులోగా చెల్లించకపోతే వాహనాలపై రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్(ఆర్టీవో)లు, రవాణాశాఖలో అమ్మకం, కొనుగోలు సహా వివిధ లావాదేవీలను అనుమతించరు. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) రెన్యూవల్, చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్తోపాటు వాహన సంబంధిత అన్ని సేవలను నిలిపివేస్తారు.
కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం ముసాయిదా ప్రకారం చలాన్ చెల్లింపులో ఆలస్యం జరిగితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఒకవేళ చలాన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత అధికారి 30 రోజులలోపు పరిషరించాలి. అధికారి సకాలంలో పరిష్కరించకపోయినా, చలాన్‌ను రద్దు చేసినా పెనాల్టీ వర్తించదు. అభ్యంతరాన్ని తిరసరిస్తే పిటిషనర్ 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలి. ఇంకా అనుమానాలు ఉంటే కోర్టులో దరఖాస్తు చేసుకోవడానికి 50% పెనాల్టీ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.
ఇప్పటివరకు చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం వాహనం ఎవరు నడిపితే వారిని బాధ్యుడిగా పరిగణించి, వారి పేరుమీదనే చలాన్ విధిస్తారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత వీటిని తుది రూపంలో నోటిఫై చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ముసాయిదాలోని అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే comments-morth@gov.in కు మెయిల్ చేయొచ్చని సూచించింది.