ఖైరతాబాద్, ఏప్రిల్ 6 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయం అప్రజాస్వామికమని, ఆ భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనేక జీవులు, వృక్షజాతులకు నెలవైన హెచ్‌సీయూ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. చెట్లను నరికివేస్తే కఠినమైన చట్టాలు ఉన్నాయని, గతంలో చెట్లను నరికిన వారికి న్యాయస్థానాల్లో కోట్లాది రూపాయల జరిమానాలు విధించిన ఘటనలు ఉన్నట్టు గుర్తచేశారు. ఇన్ని చెట్లు నరికిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎంత జరిమానా విధించాలో ప్రజలే నిర్ణయించాలన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ కాంక్రిట్ జంగల్‌గా మారిందని, త్వరలోనే ఎడారిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ.. తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అమరులు కావడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బాధ్యులని, తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు హైదరాబాద్ నగరానికి పలు కర్మాగారాలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 2,400 ఎకరాల భూమి ఉన్నదని, అందులో రూ.40 వేల కోట్ల విలువైన భూమిని రూ.10 వేల కోట్లకు ప్రభుత్వం కుదువపెట్టిందని, మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ సంస్థ రూ.వంద కోట్ల కమీషన్ మూటగట్టుకుందని ఆరోపించారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ హెచ్‌సీయూ భూముల్లో అనేక వన్యప్రాణులున్నాయని, కానీ, ప్రభుత్వం ఫేక్ వీడియోలు పెట్టారని తోసిపుచ్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ప్రతినిధి యాదగిరి, కోల జనార్దన్, అరుణ, రాజేంద్రప్రసాద్, మురళీధర్ దేశ్‌పాండే, పరశురాములు, ఆకాశ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.