హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పారదోలేందుకు ‘డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు’ కలిసికట్టుగా పోరాడాలని కోరుతూ తీర్మానించాయి. గురువారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అంతర్రాష్ట్ర మాదకద్రవ్య నిరోధక సంస్థల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థలైన ఎన్సీబీ, డీఆర్ఐ, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇమ్మిగ్రేషన్ బ్యూరో ప్రతినిధులు హాజరయ్యారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమష్టిగా పోరాడాలని, సమాచార మార్పిడిని మెరుగుపర్చాలని, ఆపరేషన్లలో సమన్వయం ఉండాలని ఏజెన్సీలు ఈ భేటీలో నిర్ణయాలు తీసుకున్నాయి.
ట్రాఫికింగ్ మార్గాలు, పరారీలో ఉన్న నిందితుల వివరాలు, అంతర్రాష్ట్ర ఆపరేషన్ల కోసం ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందించాలని, డిజిటల్ ఫైనాన్స్, ఆర్థిక లావాదేవీల మూలాలను గుర్తించాలని, అందుకు ఫోరెన్సిక్, సాంకేతికత మార్పిడి వంటి అశాలపై తీర్మానాలు చేశాయి. కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, టీజీ న్యాబ్ డీఐజీ అభిషేక్ మోహంతి, ఎస్పీ రూపేశ్, డీఆర్ఐ ఏడీజీ కేఎస్వీవీ ప్రసాద్, మహారాష్ట్ర స్పెషల్ ఐజీ శారద రౌత్, గోవా డీఐజీ వర్ష శర్మ, కేరళ డీఐజీ పీ విమలాదిత్య, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ కే నాగేశ్బాబు, తమిళనాడు ఎస్పీ మైలవగనన్, కర్ణాటక డీఎస్పీ ఎంసీ శివకుమార్, ఎన్సీబీ డిప్యూటీ డీజీ టీజీ వెంకటేశ్, అదనపు డైరెక్టర్ అరవిందన్ పాల్గొన్నారు.