హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా చూడడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సోమవారం స్పీకర్ చాంబర్లో షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీ సంక్షేమ కమిటీల తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కమిటీలు నిత్యం మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించాలని సూచించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పందిస్తూ షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేస్తూ వారి అవసరాలను గుర్తించి, అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.