హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఎల్ఈడీ దీపకాంతులతో వెలిగిపోతున్నాయి. విద్యుత్తును ఆదా చేయడంతోపాటు వీధిదీపాల విద్యుత్తు బిల్లులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో భారీ ఎత్తున ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నది. జీహెచ్ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 9.47 లక్షలకుపై ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని గుర్తించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 9.11 లక్షల లైట్లను సరఫరా చేసింది. వీటిలో 7.78 లక్షలకుపైగా ఎల్ఈడీ లైట్లను ఇప్పటికే స్తంభాలకు బిగించారు. ఇంకా దాదాపు 1.69 లక్షల లైట్లను బిగించాల్సి ఉన్నది. వీటి ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు ఏటా రూ.81.52 కోట్లు ఆదా అవుతుందని అంచనా.