ఎల్కతుర్తి, ఏప్రిల్ 13 : పదహారు నెలల క్రితం పాలనాపగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి దుర్మార్గ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లను శనివారం ఆయన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. 27న నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం యావత్తు దేశం ఎదురుచూస్తున్నదని తెలిపారు. సీఎంగా కేసీఆర్ పదేండ్ల కాలంలో హరితహారం కింద కోట్ల మొక్కలు నాటారని, చైనాలోని గోబి ఎడారిలో నాటిన మొక్కల తర్వాత అత్యధికంగా హరితహారం కింద మొక్కలు నాటిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాతోపాటు హెచ్‌సీయూలో చెట్లను తొలగిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో తాగు, సాగునీటికి కొరత లేదని, ఈ 16 నెలల్లో మళ్లీ అన్ని సమస్యలు మొదలైనట్టు చెప్పారు. అనేక రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను కేసీఆర్ బంగారు తునకలా తయారు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను నాశనం చేసిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి పాత సమస్యలను సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సభ నాంది పలుకుతుందని తెలిపారు. హామీలను విస్మరించి ఢిల్లీకి కప్పం కడుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఈ సభ చెంపపెట్టులా మారుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ఈ సభ అవుతుందని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇండ్లకు తాళాలు వేసి సభకు వచ్చి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు.