హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఆహార శుద్ధి పరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిపాదిత ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటునకు చేపట్టిన భూసేకరణ తుది దశకు చేరుకొన్నది. 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో భూసేకరణ చేపట్టగా, అందులో 15 జిల్లాల్లో భూసేకరణ పూర్తయింది. మిగిలిన 10 జిల్లాల్లో సగానికిపైగా భూ సేకరణ పూర్తి కాగా, మిగిలిన భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్న ప్రభుత్వం.. ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ తదితర సౌకర్యాలు, ఎగుమతుల ఏర్పాట్లతో ప్రత్యేక జోన్లను తేవాలని నిర్ణయించింది. కాలుష్య నివారణ చర్యలతోపాటు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యంతో అభివృద్ధి చేయాలని నిశ్చయించింది.
ఈ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాటయ్యే యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, రైతు సంఘాలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ జోన్లలో యూనిట్ల ఏర్పాటు కోసం టీఎస్ఐఐసీకి 1,496 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో లేకపోవటంతో ఈ జిల్లాల్లో సేకరణ సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయినట్టేనని వెల్లడించారు. త్వరలో భూ కేటాయింపుల ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం విశేషాలు, ప్రధానపెట్టుబడుల వివరాలు :