ఇంద్రవెల్లి, డిసెంబర్ 9 : ఏజెన్సీ ప్రాంతానికి అక్రమంగా వలస వచ్చి చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ మైపతి అరుణ్‌కుమార్, గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు డిమాండ్ చేశారు. ఏజెన్సీలో మైనార్టీలను మైదాన ప్రాంతాలకు తరలించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమరవీరుల స్ఫూర్తితో మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్టీ జాబితాలో అక్రమంగా చేరిన లంబాడాలను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 1970 తరువాత జైనూర్ మండలంలో వలస వచ్చిన మైనార్టీలను ఇతర ప్రాంతంతోపాటు మైదాన ప్రాంతానికి తరలించాలని సూచించారు. జైనూర్ ఘటనలో ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమన్వయ కర్త సిడాం భీంరావ్ , సార్మేడిలు మెస్రం వెంకట్రావ్పటేల్, తుంరం జుగాదిరావ్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.