హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : లంబాడీల ‘గోర్బోలీ’ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి, వారి భాషకు లిఖితరూపం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ, ‘గోర్బోలీ’ భాషను బంజారాలు, లంబాడా ప్రజలు ఎక్కువగా మాట్లాడతారని, వారందరినీ కలిపి ‘గోర్మాటి’ అంటే ‘సొంతజనులు’ ‘స్వజనులు’ అని పిలుస్తారని చెప్పారు. లక్షలాది మంది మాట్లాడుతున్న ఈ భాషకు లిఖితరూపం ఇవ్వడం సబబేన ని పేర్కొన్నారు. మన దేశంలో లంబాడాలకు వేలాది ఏండ్ల చరిత్ర ఉన్నదని, అయితే 14వ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తున్నదని చెప్పారు. వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడ్ ప్రాంతంలో ఉన్నాయ ని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో విస్తరించారని తెలిపారు. పదకొండుకుపైగా రాష్ట్రాల్లో ఆచరణలో ఉన్న ‘గోర్బోలి’ భాషను కూడా 8వ షెడ్యూల్లో చేర్చడానికి కావలసిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.