కడ్తాల్, ఫిబ్రవరి 10: కడ్తాల్ మండల (Kadthal) కేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన లక్ష్మీచెన్నకేశవస్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరణాలు, వివిధ రకాల పూలతో శోభయమానంగా ముస్తాబు చేశారు. దేవతమూర్తులను శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, గ్రామ ప్రధాన పురోహితుడు మెళ్ళూరి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివిధ రంగుల పూలమాలలతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని, లక్ష్మీ, భూనీలా అమ్మవారిని, దేవతమూర్తులను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య, బ్యాండ్ మేళ్లాలు, ముత్యాల తలంబ్రాలతో భూనీల సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామి వారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి జైపాల్ యాదవ్ ఐదు తులాలు, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి మూడు తులాలు, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశుప్తా తులం బంగారం, స్వప్న అర కిలో వెండి విరాళం ప్రకటించారు.
మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.80 వేల చొప్పున అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేతోపాటు నాయకులను ఆలయ నిర్వాహకులు శాలువాలతో సన్మానించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అభివృద్ధి చైర్మన్ ఆంజనేయులు, ఏఎంసీ చైర్పర్సన్, గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ దశరథా నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ ఎల్ఎన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాన్రెడ్డి, శాయిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, జంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్, వెంకటేశ్, రవీందర్‌రెడ్డి, పాండునేత, అశోర్రెడ్డి, మహేశ్, లక్ష్మయ్య, రవి, ఆలయ అనువంశీక అర్చకులు రఘురాం, వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారాయణ, వెంకటేశ్, నర్సింహా, శ్రీనివాస్, పవన్ కల్యాణ్, భక్తులు పాల్గొన్నారు.