హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జర్నలిజంలో ప్రతిష్ఠాత్మక పురస్కారంగా భావించే లాడ్లీ అవార్డు ‘నమస్తే తెలంగాణ’ పాత్రికేయురాల్ని వరించింది. సంస్థలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ఇంద్రగంటి లక్ష్మీహరిత రాసిన మహిళా సాధికారికతకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథనానికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. మగువ తెగువకు అద్దంపట్టే ఫీచర్ పేజీ ‘జిందగీ’ కోసం పనిచేస్తున్న లక్ష్మీహరిత.. మానవీయ కథనాలు, మహిళా విజయ గాథలు ఎన్నో రాశారు. ఈ క్రమంలో 2022 సంవత్సరానికి లాడ్లీ నిర్వహించిన పోటీల్లో ‘ఆమె గెలిచింది.. జడ్జిగా నిలిచింది’ శీర్షికన లక్ష్మీహరిత రాసిన సివిల్ జడ్జి మంజుల స్ఫూర్తిదాయక కథనం ‘బెస్ట్ తెలుగు ఫీచర్ స్టోరీ’ ఎంపికయ్యింది.