హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన మాటలకే పరిమితమైందని, చేతల్లో మాత్రం రాచరిక పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ 20నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. సహకార సంఘాలకు గడువు ముగిసినా, వాటికి పదవీకాలం పొడిగించారే తప్ప, ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. సర్పంచ్‌లలో ప్రస్తుతం 51.5 శాతం బీసీలు, ఎంపీటీసీల్లో 50.5 శాతం బీసీలు ఉన్నారని, అయినా ఓడిపోతామన్న భయంతో రిజర్వేషన్ల సాకుతో ఎన్నికలు పెట్టడం లేదని ఆరోపించారు.
గద్దెల ఆధునికీకరణ కాదు..వందశాతం రుణమాఫీ చేయాలి
మేడారం గద్దెలను ఆధునికీకరించడం కాదని, తొలుత మేడారం రైతులకు వందశా తం రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చే శారు. మంత్రి సీతక్క సొంతగ్రామం పక్కన ఉన్న ఊళ్లలోనూ పూర్తిగా రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో సమ్మక్క-సారలమ్మ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.