హనుమకొండ : రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి(CPI Secretary ) కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambashiva Rao) అన్నారు. వరంగల్‌లో ప్రధాని మోదీ ( Narendra Modi) పర్యటనను నిరసిస్తూ సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏకశిలా పార్కు ఎదుట నిర్వహించిన ధర్నా(Dharna)లో ఆయన మాట్లాడారు.
విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం(Cheating) చేసిందన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ(Coach Factory), బయ్యారంలో ఉక్కు పరిశ్రమ (Steel Industry), ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా(National Status) ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కాజీపేటలో ఉన్ని పీరియాడికల్ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ స్థానంలో వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, తాజాగా వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహారాష్ట్ర లాతూర్‌లో, గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ ని మరుగున పరిచేందుకే కేవలం రూ. 521 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ యూనిట్ పేరుతో మభ్యపె డుతున్నారని విమర్శించారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ వస్తే ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. గిరిజన యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు మేలు జరిగేదని అన్నారు. మామునూర్ ఎయిర్ ఫోర్టును అభివృద్ధి పరచలేదని, గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో ఒక పరిశ్రమనూ వరంగల్‌లో ఏర్పాటు చేయలేదన్నారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తకళ్లపల్లి శ్రీనివాస రావు సహా నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్, మండ సదాలక్ష్మి, ఆదరి శ్రీనివాస్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.