మలక్‌పేట, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైలుకు పంపించడమే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వీయాదవ్ను సోమవా రం మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమరాజ్యం అని భ్రమపడ్డారని, కానీ, ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రజల మాటలను చూపిస్తే కేసులెలా పెడతారని ప్రశ్నించారు. జనం నిలదీస్తే, ఇదేమిటని ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతారా? అక్రమకేసులు పెట్టి జైలుకు పంపుతారా? అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమకేసులు, దాడులతో వేధిస్తున్నదని ఆరోపించారు.
పాలనలో విఫలమైనట్టు ఒప్పుకున్న సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రేవంత్‌రెడ్డే ఒప్పుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని స్టేషన్‌ఘన్‌పూర్‌లో చెప్పారని, ఇందుకు రేవంత్ అసమర్థ విధానాలే కారణమని విమర్శించారు. తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని స్వయంగా ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేశారని ఎద్దేవా చేశారు. ఇకనైనా మీడియా గొంతువిప్పి రేవంత్‌రెడ్డి అక్రమాలపై మాట్లాడాలని సూచించారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడేవిధంగా రాహుల్‌గాంధీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాలను మళ్లీ గుర్తు చేసే విధంగా మీడియా పాటుపడాలని కోరారు.
ప్రభుత్వ అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అరెస్టులు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తున్నదని రేవతి, తన్వీయాదవ్ అంటుంటే చాలా బాధగా అనిపించిందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని అడగితే విజయరెడ్డి, సరితయాదవ్పై కేసు పెట్టి వేధించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో 11 మంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా జర్నలిస్టులను అరెస్టు చేస్తూ ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టగారు.
అరెస్టులు అమానుషం: సునీతాలక్ష్మారెడ్డి
రేవతి, తన్వీయాదవ్ అరెస్టు దారుణం, అమానుషమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పే ర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రజల హక్కులను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై ఈ అరాచకాలు ఏమిటని ప్రశ్నించారు. తెల్లవారుజామున రేవతి, తన్విని అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఆజం అలీ, చెల్లూరి రఘునందన్‌రెడ్డి, తేళ్ల మహేశ్‌కుమార్, భూమేశ్, నాగరాజు, సామ సుందర్‌రెడ్డి, రామ్నరసింహ, పగిళ్ల నర్సింగ్, బాబు సుదర్శన్, యాదగిరి పాల్గొన్నారు.
అక్రమ కేసులు పెట్టడమే ఏడో గ్యారెంటీ అమలా?
‘ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధించమే ఏడో గ్యారెంటీనా? ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోవడమే ఏడో గ్యారెంటీనా? తన భార్యాపిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న రేవంత్ గతంలో మాపై అవాకులు, చెవాకులు పేలిన సంగతి మర్చిపోయారా? మా పిల్లల ప్రస్తావన తెచ్చినప్పుడు రేవంత్‌కు తన కుటుంబం గుర్తుకు రాలేదా? నువ్వు మాట్లాడితే మంచిది, ఇంకొకరు మాట్లాడితే చెడ్డదా? రేవంత్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి’ అని కేటీఆర్ మండిపడ్డారు. తాము కేసులు, బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని, రేవతి, తన్వీయాదవ్ తరపున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.