Assembly Session | గుండు సున్నాపై సమరభేరి.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది.
- మోదీ అంటే భయమెందుకు రేవంత్.. కేటీఆర్ సూటి ప్రశ్న
- కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా?
- సీఎం, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి.. మేం మద్దతిస్తం
- రాజకీయాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యం
- లోక్‌సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ర్టానికి అన్యాయం
- తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే
- కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
- బడ్జెట్లో అన్యాయంపై తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం
- రాష్ర్టానికి నిధులివ్వని కేంద్రంపై కలిసి పోరాడుదాం
- కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగొచ్చేది 47 పైసలు మాత్రమే!
- దక్షిణాదిపై కేంద్రం కక్ష సాధింపు కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేస్త
- 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తాం: సీఎం రేవంత్
క్యాబినెట్ దీక్ష చేయాలి
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి. మేము అండగ ఉంటం. మేం సుట్టు కూసుంటం. కేంద్రంతో కొట్లాడుదాం. అందరంబోయి కూర్చుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగారు ఈ మధ్య ఒక్కసారి కాదు.. రుణమాఫీ అంటే హరీశ్‌రావు దీక్షచేయాలంటడు. నిరుద్యోగుల సమస్యలంటే నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటడు.. అందుకే నేను అడుగుతున్న. మొత్తం క్యాబినెట్ కూర్చోండి. మేం వెయ్యిమందిమి వస్తం.
రేవంత్‌లా పరాన్నజీవులం కాదు
మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు. రేవంత్‌రెడ్డికి ఉన్నాయ్.. ఢిల్లీలో బీజేపోళ్లతోని స్నేహం చేయడం. ఇప్పటికీ ఆయన పనులన్నీ బీజేపీ ఎంపీలే చేస్తరు. ఆయన ఎటంటే అటు మాట్లాడవచ్చా? కేసీఆర్‌గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. విలీనం చేయడానికి మేమేమీ రేవంత్‌రెడ్డిలాగా పరాన్నజీవులం కాదు. వారు పదవుల కోసం పార్టీలు మారిండ్రు. మేమట్లగాదు. పదవులు వదులుకున్నం తెలంగాణ కోసం. ఒక్కసారికాదు వందసార్లు రాజీనామా చేసినం.
– కేటీఆర్
కేసీఆర్‌ను దీక్షకు రమ్మంటున్నారు.. ఆయన ఆనాడే తెలంగాణను చావునోట్లో తలపెట్టి తెచ్చిండ్రు. కేసీఆర్ ధర్నాకెందుకు? నువ్ చెయ్.. నీకు వెయ్యి మందిమి రక్షణ కవచంగా ఉంటాం. మా ఎమ్మెల్యేలందరం వచ్చి మీ చుట్టూ రక్షణగా ఉంటాం. మీరు, మీ క్యాబినెట్ దీక్ష చేయండి.
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
Assembly Session | హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ… సభ నుంచి వాకౌట్ చేసింది.
ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు కే తారకరామారావు, హరీశ్‌రావు మధ్య మాటల తూటాలు పేలిపోయాయి. ప్రధాని మోదీని బడేభాయ్ అని పిలిచినా ఏమాత్రం ఫలితం దక్కలేదని కేటీఆర్ వ్యంగాస్త్రం సంధించారు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై పదేండ్లుగా తాము పోరాడుతున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తత్వంబోధ పడిందంటూ చురకలేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించాలంటే.. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు యాచిస్తే రాదు.. శాస్తినే వస్తది అని కుండబద్దలు కొట్టారు.
నిధుల సాధనకు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ సూచించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘మీరు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను తీసుకొని రండి.. నేను, ఆయన కలిసి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ప్రాణాలు పోయే దాకా దీక్షలు చేస్తాం. తెలంగాణకు నిధులు తెచ్చుడో.. సచ్చుడో తేల్చుకుందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు. సీఎం వ్యాఖ్యలకు సమాధానం చెప్తామని, తమకు మైక్ ఇవ్వాలని హరీశ్‌రావు, కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టుబట్టారు. పోడియం వద్దకు చేరి ముక్తకంఠంతో నినదించారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో మళ్లీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలుగజేసుకుని సీఎం వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ‘షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు చేతులు జోడించి దండం పెడుతూ మైక్ ఇవ్వాలని వేడుకున్నారు. భట్టి మాట్లాడిన తర్వాత మైక్ ఇస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో ఎవరి స్థానాల్లో వారి కూర్చుకున్నారు.
భట్టి మాట్లాడిన అనంతరం హరీశ్‌రావుకు స్పీకర్ అనుమతిచ్చారు. దీంతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దానిపై తీర్మానం ప్రవేశపెడితే దానిని ఏకగ్రీవంగా ఆమోదించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి అఖిలపక్షంగా వెళ్లి ధర్నా చేద్దామంటే మేము కూడా సిద్ధం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది.. ఉంటది’ అని స్పష్టంచేశారు. ‘కేసీఆర్‌ను దీక్షకు రమ్మంటున్నారు.. కేసీఆర్ ఎందుకు? నువ్ చెయ్.. నీకు వెయ్యి మందిమి రక్షణ కవచంగా ఉంటాం. అని హరీశ్ అంటుండగానే మరోసారి మైక్ కట్ చేశారు. సభా నేతవ్యాఖ్యలను స్పీకర్ సమర్థిస్తూ ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు.
అన్నీ మేమే చేస్తే.. మీరెందుకు?
‘రుణమాఫీ గురించి ఆ మధ్య సీఎం మాట్లాడుతూ.. హరీశ్‌రావు దీక్షలు చేయాలన్నారు. నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్షలు చేయాలన్నారు. అన్నీ మేమే చేస్తే.. ఇక మీరేం చేస్తారు? మాది ఉద్యమస్ఫూర్తి. తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని ఆనాడు రాజీనామా చేయమంటే పారిపోయిన చరిత్ర మీది. ఆనాడు రాహుల్ గాంధీని పప్పు అన్నావ్.. నేడు పీఎం అభ్యర్థి అంటున్నవ్..’ అని అంటుండగానే మైక్ కట్ చేశారు. వెంటనే మంత్రి శ్రీధర్‌బాబు కలుగజేసుకొని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసేందుకు సహకరించాలని కోరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మాకొక ట్రాక్ రికార్డు ఉన్నది. మా నాయకుడు చెప్తే రెండుసార్లు గడ్డిపోచల్లాగా మా పదవులను విసిరివేసినం. ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. మీరు ఈ రకంగా మా ఉద్యమ స్ఫూర్తిని అవమానపర్చిన మాటలను సభ రికార్డుల నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

