హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఈ ఎన్నికలపై గురిపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తుగా ఓడించాలని పిలుపుని చ్చారు. 2019 జూన్ 21న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ప్రాజెక్టును ప్రారంభించి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫార్ములా-ఈ కార్ రేసుకు సంబంధించి సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.40 వరకు ఎనిమిదిన్నర గంటలకుపైగా విచారణను ఎదుర్కొన్నారు.
అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని, తల దించుకునే పని అస్సలే చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ, తప్పు చేయలేదని స్పష్టంచేశారు. ఫార్ములా-ఈ కార్ రేసు గురించి నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు కోట్ల ప్రజల ముందు, అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ‘ఈ బద్నాం కార్యక్రమం ఇంకా ఎన్ని రోజులు నడుపుతావ్. నేను తప్పు చేయలేదు. నా నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని చెప్పా. రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రావాలని సవాల్ చేస్తే పారిపోయిండు’ అని ఎద్దేవా చేశారు. ఫార్ములా-ఈ కేసులో ఏమీ లేకపోయినా మరోసారి పిలిస్తే చట్టాలను గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న వ్యక్తులుగా విచారణకు వచ్చినట్టు చెప్పారు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావును ఆలింగనం చేసుకుంటున్న కేటీఆర్
నాపై ఇప్పటికే 14 కేసులు పెట్టావ్. ఇంకా 1400 కేసులు పెట్టుకో. అవసరమైతే జైల్లో పెట్టుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లా జైలుకు పోవడానికి కూడా సిద్ధమే.
– కేటీఆర్
2019 జూన్ 21న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలి.
– కేటీఆర్
మొదటి సంవత్సరం ఫార్ములా-ఈ రేసు విజయవంతం కావడంతో రెండో సంవత్సరం కూడా హైదరాబాద్‌లోనే దానిని నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాను తప్పితే ఒక్క రూపాయి కాదు కదా, పైసా అవినీతి కూడా జరగలేదని పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు. ‘ఇక్కడ్నుంచి పైసా అక్కడికి పోయింది. అది ఆడనే ఉన్నది.
మరి అవినీతి ఎకడ ఉందని నేను అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు’ అని చెప్పారు. ‘ఫైలు ఎటుపోయింది? నువ్ కుడిచేతులకెళ్లి ఇచ్చినవా? ఎడమ చేతిలకెళ్లి ఇచ్చినవా? అని పనికిమాలిన ప్రశ్నలు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలే తప్ప వాటిలో విషయంలేదు’ అని విచారణ తీరును ఎండగట్టారు. ‘నేను మొన్ననే చెప్పినా, మళ్లీ చెప్తున్నా. ఇదొక లొట్టపీసు కేసు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అసలు కరప్షనే జరగని ఓ తుపేల్, లొట్టపీసు కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 ఏండ్ల పోలీస్ కెరీర్లో చూడనే లేదని మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
ఫార్ములా-ఈ కేసులో విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణభవన్ గేట్లకు తాళం వేసిన పోలీసులు
‘ఆయనకు ఉన్నదంతా ఒక్కటే షోకు. ఓ తప్పుడు పనిచేసి అడ్డంగా దొరికి, నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి వాళ్లను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న ఆలోచనతో రేవంత్‌రెడ్డి ఉన్నాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్‌తో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ‘ప్రపంచంలోనే అతిగొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మిస్తే అందులో చేయని తప్పుకు కేసీఆర్, హరీశ్‌రావుని కమిషన్ ముందుకు పిలిచి, వాళ్లను అక్కడ ఇబ్బంది పెట్టి, కార్యకర్తల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కొద్దని, నాకు జరిగింది నీకు కూడా జరగాలనే మనస్తత్వంతో ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని జైల్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకాదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదని విమర్శించారు. దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
‘ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి, పై నుంచి నన్ను అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి మీకు ఉంటే బేషుగ్గా అరెస్టు చేసుకోవచ్చని ఏసీబీ అధికారులకు చెప్పా. ఇప్పుడు కూడా మళ్లీ చెప్తున్నా. తప్పు చేయలేదు. తలదించుకోలేదు. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం. రేవంత్ ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్లో లేరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. పైసా అవినీతి లేని ఈ కేసులో ఏసీబీతో విచారణ జరపడం దద్దమ్మ రాజకీయంగా కేటీఆర్ అభివర్ణించారు.
అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందన్న కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘పెడితే ఒక 15 రోజులు నన్ను జైల్లో పెట్టి రేవంత్‌రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడు’ అని అన్నారు. ‘నాపై ఇప్పటికే 14 కేసులు పెట్టావ్. ఇంకా 1400 కేసులు పెట్టుకో. అవసరమైతే జైల్లో పెట్టుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లా జైలుకు పోవడానికి భయపడేది లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఈ బద్నాం కార్యక్రమం ఇంకా ఎన్ని రోజులు నడుపుతావ్. నేను తప్పు చేయలేదు. నా నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని చెప్పా. రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రావాలని సవాల్ చేస్తే పారిపోయిండు.
-కేటీఆర్
‘నీలా రూ.50 లక్షల బ్యాగుతో దొరికిన దొంగలెవరూ మా పార్టీ లేరు’ అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘నేనేదో అన్నందుకు సీఎం చాలా బాధపడ్డడట. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ‘జై తెలంగాణ’ అని అనకపోతే ఏమనాలి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే ఏమనాలి? దివాలా రాష్ట్రమంటే ఏమనాలి? ఢిల్లీకి పోతే అపాయింటెమెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నారనంటే ఏమనాలి’ నిలదీశారు. ప్రస్తుతం ఏసీబీ కేసులు ఒక డైలీ సీరియల్లా మారాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉదయం నుంచి ఓపికగా తనకోసం ఎదురుచూసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు, మీడియా మిత్రులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫైలు ఎటుపోయింది? నువ్ కుడిచేతులకెళ్లి ఇచ్చినవా? ఎడమ చేతిలకెళ్లి ఇచ్చినవా? అని పనికిమాలిన ప్రశ్నలు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలే తప్ప వాటిలో విషయంలేదు.
– కేటీఆర్