KTR | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): పోలీసులు సీఎం రేవంత్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఏ అధికారంతో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీ డియాతో మాట్లాడుతూ పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్‌రెడ్డిని అక్రమంగా కిడ్నాప్ చేసి, భయానక వాతావరణం సృష్టించారని ధ్వజమెత్తారు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యు లు చెప్పినా వినకుండా రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ డీకే అరుణ లగచర్లకు వెళ్తానంటే ఆమెనూ పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
తిరుపతిరెడ్డికి ఉన్న అధికారం ఏమిటి?
కనీసం వార్డు మెంబర్ కూడా కాని తిరుపతిరెడ్డిని సీఎం సోదరుడనే అర్హతతో లగచర్లకు 300 మందితో వెళ్లనిచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. లగచర్లలో తన అనుచరులతో తిరుపతిరెడ్డి స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను చిత్ర హింసలు పెట్టే నికృష్టమైన సర్కారు దాపురించిందని మండిపడ్డారు.
మహిళ ఛాతిపై తొక్కి.. భర్తను అరెస్టు చేస్తరా?
లగచెర్లలో ఇంట్లోకి వెళ్లి మహిళ ఛాతిపై కాలితో తొకి ఆమె భర్తను అరెస్ట్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో ఏ నియంత, అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ, అణచివేత పాలనను రేవంత్ సాగిస్తున్నారని భగ్గుమన్నా రు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామనే విషయాన్ని డీజీపీ సహా పోలీసులు గుర్తించాలని హితవు పలికారు. 144 సెక్షన్ ఉన్నా 300 మందితో తిరుపతిరెడ్డిని లగచర్లకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి భూదాహానికి అధికారులు బలికావద్దని, అతిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చూడాలని కేటీఆర్ హితవుపలికారు. నరేందర్‌రెడ్డి కుటుంబానికి ఏ స్థాయిలో పార్టీ అండగా ఉంటుందో లగచర్లలోని రైతులకు కూడా బీఆర్ఎస్ అలానే అండగా ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వాళ్ల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, రేవంత్‌రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముకులాంటిదని చెప్పారు. ఢిల్లీ వాళ్లకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆయన పదవి ఊడిపోతుందన్నారు. కొడంగల్‌కు సెక్యూరిటీ లేకుండా వస్తే ప్రజలు తిరగబడతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు.
హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం
రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు చిత్ర హింసలు పెట్టి తీవ్రంగా కొట్టారని, ఈ ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై బీజేపీ, కమ్యూనిస్టు సహా అన్ని పార్టీలు స్పందించాలని, లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని వాపోయారు. వికారాబాద్ కలెక్టర్ దాడి జరగలేదని అంటుంటే ప్రభుత్వం, పోలీసులు మాత్రం దాడి జరిగిందని అంటున్నారని, అసలేం జరిగిందో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. జిల్లా మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడటం సరికాదని కేటీఆర్ హితవు పలికారు.