KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నూతన సాంకేతిక ఆవిష్కరణలు సమాజ పురోభివృద్ధికి దోహదం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న సాంకేతికత సమాజ వికాసానికి దోహదం చేయాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ ప్రపంచాన్ని రూపొందించే దిశగా నూతన ఆవిషరణలు కొనసాగాలని అభిలషించారు. ఏ సాంకేతికతను ఎందుకు వినియోగిస్తున్నామనే స్పష్టమైన అవగాహన ఆవిష్కర్తలకు ఉండాలని సూచించారు.
గురువారం బెంగళూరులో ప్రారంభమైన అంత్రప్రెన్యూర్ టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025లో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా- టెక్నాలజీ అభివృద్ధికి మార్గదర్శనం.. ఆవిషరణలు’ అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కానీ, ప్రతి సాంకేతిక ఆవిషరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ (ఐవోబీ) వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని ఎలా మార్చగలవో వివరించారు.
‘రేడియోలు మాయమయ్యాయి, టీవీలు వచ్చాయి, ఇప్పుడు పాడ్‌కాస్టుల హవా నడుస్తున్నది. ఫార్మాట్ మారుతుండొచ్చు, కానీ, మానవ అవసరాలు ఎప్పటికీ మారవు’ అని ఉదహరించారు. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించుకోకపోతే అది ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరించారు. భవిష్యత్తు నిర్మాణం అంటే ‘జీవించడం కాదు. రేపటిని నిర్మించడం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ పురోగతి ఆ దిశగా జరగాలని ఉద్భోదించారు.
డ్రోన్స్‌ను వ్యవసాయరంగంలో సమర్థంగా వినియోగించుకోవచ్చునని, అదే సమయంలో అదే డ్రోన్స్ టెక్నాలజీని నెగెటెవ్ కోసం వినియోగిస్తే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే భయానకంగా ఉంటుందని చెప్పారు. ఏ సాంకేతిక ఆవిష్కరణ అయినా రెండంచుల పదునైన కత్తిలా ఉంటుందని, దానిని వినియోగించే వైఖరిని బట్టి ఫలితాలు ఉంటాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంతో పెనవేసుకుంటున్న కొద్దీ, సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ సైబర్‌నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్‌నేరాలకు ఎందుకు పాల్పడుతున్నదో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక కాలర్ట్యూన్తో సైబర్నేరాలను అరికట్టలేమంటూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి చురకలు అంటించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల జరుగుతున్న దుష్పరిణామాలను ఆపడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని వివరించారు.
సాంకేతిక అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ భారీ డాటా సెంటర్లను ఏర్పాటుచేస్తున్నారని, అయితే, వాటి కోసం వినియోగించే విద్యుత్తు, నీటి వినియోగంపై ఎవరూ దృష్టి సారించడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. టెక్నాలజీ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తులో ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఐవోటీ, మొబైల్ యాప్‌లు, డాటా స్టోరేజ్ పెరుగుతున్నాయని, అదే సమయంలో వాటివల్ల ఉత్పన్నం అయ్యే పర్యావరణ సమస్యలు ఏ స్థాయిలో ఎదురుకాబోతున్నాయో ఆలోచించాలని సూచించారు.
మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్ష గురించి మాత్రమే కాకుండా టెక్నాలజీ తెలిసినవారు, తెలియనివారు అని సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీ నిరక్షరాస్యతను ఎలా అధిగమించాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో డిజిటల్ విభజన పెరుగుతున్న కొద్దీ అంతరం పెరుగుతున్నదని, అది అందరికీ సమానంగా అందినప్పుడే సమాన అవకాశాలు కలుగుతాయని వివరించారు. సాంకేతికతకు అద్దంపట్టిన టర్మినేటర్ సహా పలు హాలీవుడ్ సినిమాల్లోని ‘హస్తలా విస్తా’ వంటి డైలాగ్‌ను సభికుల హర్షధ్వానాల మధ్య ఉటంకిస్తూ ‘నమసార శుభవాగళి’ అంటూ కన్నడ పలుకులతో కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.