హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపులో రాష్ట్రానికో నిబంధన ఎందుకు? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని బొగ్గు గనులను వేలం నుంచి తొలగించి రాష్ట్రానికి కేటాయించాలని అక్కడి ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని కోరగానే వాటిని వేలం నుంచి తొలగించడానికి అంగీకరించారని, అదే తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తొలగించి సింగరేణికి ఎందుకు కేటాయించడంలేదని శనివారం ట్విట్టర్లో మంత్రి ప్రశ్నించారు. దీని కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కూడా నిరసనలు, ఆందోళనలు చేపట్టామని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధన కాకుండా రాష్ట్రానికో విధానం ఉంటుందా? అంటూ నిలదీశారు. వేలం లేకుండా నాలుగు బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో బొగ్గు గనుల వేలంపై వెనక్కి తగ్గిన కేంద్రం
తమిళనాడులో బొగ్గు గనుల వేలంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కావేరీ డెల్టాలో మూడు బొగ్గు గనుల వేలం వేయాలని కేంద్రం నిర్ణయించగా.. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమైనా ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసహరించుకున్నది. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.