జగిత్యాల, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ గురువారం జగిత్యాలలో భేటీ కానున్నారు. కేటీఆర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు సైతం జీవన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనునున్నారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్‌రెడ్డి నలభై మూడేండ్లుగా ఉత్తర తెలంగాణలోనే కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి మూడు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన జీవన్‌రెడ్డి 2019లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జీవన్‌రెడ్డి వర్గానికి ప్రాధాన్యత తగ్గిపోవడం, నామినేటెడ్ పదవుల కోసం ప్రతిపాదించిన వారికి పదవులను ఇవ్వకుండా ఎమ్మెల్యే సూచించిన వ్యక్తులకు ఇవ్వడం, ప్రధాన అనుచరుల్లో ఒకరు దారుణహత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పక్కన పెట్టడంతో తీవ్ర ఆవేదనకు లోనైన జీవన్‌రెడ్డి గత నెల 25న కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
బీఆర్ఎస్కి వెళ్లాలని కార్యకర్తల అభిలాష
జీవన్‌రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితులతో పలుసార్లు ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న విషయమై అంతర్గత సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజల ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చడానికి అందులోకి వెళ్లడమే సరైన చర్య అంటూ కార్యకర్తలు పేర్కొనడంతో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్తో ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
జీవన్‌రెడ్డితో భేటీ కానున్న కేటీఆర్
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సైతం జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తానంటే తన భుజాలపై మోసుకువస్తానంటూ ప్రకటించారు. పది రోజుల క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్‌రెడ్డితో ఫోన్లో చర్చలు జరిపినట్లు సమాచారం. బిజినెస్ సమ్మిట్ కోసం అమెరికా వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాత జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి కలుస్తానని కేటీఆర్ పేర్కొన్నట్టు వార్తలు వెలువడ్డాయి. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్ వస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. కేటీఆర్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు సైతం జీవన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. జీవన్‌రెడ్డితో రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి లాంఛనంగా కేటీఆర్ ఆహ్వానించనునున్నారు.
అభిమానులు అందుబాటులో ఉండాలని పిలుపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులందరూ గురువారం జీవన్‌రెడ్డి ఇంటికి వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరూ అందుబాటులో ఉండాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు, బీఆర్ఎస్ నాయకులకు సాదర ఆహ్వానం పలకాలని కోరుతూ, మెసేజ్‌లు పంపించారు.