హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మరో ఘనతను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియా ప్రభావశీలుర జాబితాలో ఆయనకు చోటుదక్కింది. టాప్-30 జాబితాలో 12వ స్థానంలో కేటీఆర్ నిలిచారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రభావశీలత చూపుతున్న ప్రముఖుల జాబితాను కోర్ అనలెటిక్స్ విడుదల చేసింది.
టాప్-30 సోషల్‌మీడియా ఇన్ఫ్లూయన్సర్ల జాబితాలో మంత్రి కేటీఆర్ 12వ స్థానంలో నిలువడం గమనార్హం. భారత్ నుంచి ఇద్దరు యువనేతలకు మాత్రమే ఈ జాబితాలో చోటు దకడం విశేషం. అందులో ఒకరు కేటీఆర్ కాగా.. మరొకరు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా 23వ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరిలోనూ మంత్రి కేటీఆరే ముందంజలో ఉండటం విశేషం. పైగా కేటీఆర్‌కు 38,34,171 మంది ఫాలోవర్స్ ఉన్నట్టుగా కోర్ అనలెటిక్స్ పేర్కొన్నది.
తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిషారానికి నిరంతరం శ్రమిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అటు అధికారిక, ఇటు వ్యక్తిగత ఖాతాల్లోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. టాప్ సోషల్‌మీడియా ప్రభావశీలుర జాబితాలో మంత్రి కేటీఆర్ కు చోటు దకడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మంత్రి కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.