KTR | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు రాజకీయంగా భారత్ మొత్తానికి రోల్ మాడల్ అని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్ రేఖి ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ ధ్యాస మొత్తం అభివృద్ధి, పెట్టుబడుల సాధనపైనే ఉంటుందని కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతీయ అమెరికన్ అయిన రేఖి ప్రస్తుతం అమెరికాలోని ‘ఇన్వెస్టస్ క్యాపిటల్ పార్ట్నర్స్’ ఎండీగా పనిచేస్తున్నారు. అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో తన కంపెనీని లిస్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఆయన. కన్వల్ అనేక సంస్థలను స్థాపించారు. ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఆదివారం తన ఫేస్బుక్ ఖాతాలో మంత్రి కేటీఆర్‌ను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు.
కేటీఆర్‌ను ఉత్సాహవంతుడైన, టెక్నాలజీపై పట్టున్న యువ మంత్రి అని అభివర్ణించారు. ‘నేను కేటీఆర్‌ను అమెరికాలో, భారత్‌లో పలుమార్లు కలిశాను. ఆయన ఎప్పుడూ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. తెలంగాణకు పెట్టుబడుల సాధన కోసం పర్యటిస్తూ, తన రాష్ర్టాన్ని ప్రమోట్ చేస్తుంటారు. తెలంగాణ చిన్న రాష్ట్రమే.. ఆ రాష్ట్ర జనాభా భారత దేశ జనాభాలో 2.5 శాతం మాత్రమే. అయినా దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉన్నది. మంత్రి కేటీఆర్‌ను ఇతర రాష్ర్టాలు రాజకీయంగా రోల్‌మాడల్‌గా తీసుకోవాలి. ఆయన ఏదో ఒకరోజు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో కనిపిస్తారు. తన శక్తిని మొత్తం దేశం అభివృద్ధికి విస్తరిస్తారని ఆశిస్తున్నాను. ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులను విస్తరించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రోజురోజుకూ బలపడుతున్నది’ అని రేఖి పోస్ట్ చేశారు.