హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా పనిచేసిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ‘23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్’లో ప్రసంగించాల్సిందిగా అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వాన లేఖ పంపింది. తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టడంలో కేటీఆర్ చేసిన విశేష కృషిని గుర్తించి ఈ ఆహ్వానం పంపినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ తెలిపింది. హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్ విస్తరణ, స్టార్టప్ సంస్కృతి అభివృద్ధి, డిజిటల్ గవర్నెన్స్, అర్బన్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ ఆధారిత ఉద్యోగాల సృష్టి వంటి రంగాల్లో కేటీఆర్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నది. ‘ది ఇండియా వి ఇమాజిన్’ అనే థీమ్‌తో ఈ సదస్సును ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్స్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారత్‌తోపాటు దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి వెయ్యిమందికిపైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. గతంలో ఈ వేదికపై నీతా అంబానీ, నితిన్ గడరీ, అజీమ్ ప్రేమ్‌జీ, అజయ్ బంగా, జైరాం రమేశ్, రాధికా గుప్తా, కరిష్మాకపూర్, సబ్యసాచి వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ప్రసంగించారు.