పటాన్చెరు రూరల్, జూలై 24 : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్న వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సందేశం ఇచ్చారు. తెలంగాణ పరిరక్షణ కోసం ప్రజల పక్షాన జరుగుతున్న పోరాటంలో నేనున్నా అంటూ భరోసా కల్పించారు. ప్రభుత్వం, పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నా… ధైర్యంగా ఉద్యమిస్తున్న వారికి తోడుగా ఉన్నానని చాటిచెప్పారు. గురువారం కేటీఆర్ బర్త్ డే వేడుకలను సోషల్‌మీడియా వారియర్ ఇంటికి వెళ్లి.. ఆ కుటుంబంతో కలిసి జరుపుకోవడం పట్ల శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల తరఫున గళమెత్తినందుకు ఎక్కడైతే అవమానకరంగా పోలీసులు అరెస్టు చేశారో.. గురువారం అదే ఇంట్లో ఆనందాలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన జన్మదిన వేడుకలను శశిధర్‌గౌడ్ ఇంట్లో జరుపుకున్నారు.
ఈ రోజు కేటీఆర్ సార్ బర్త్‌డే.. మన ఇంటికి వస్తున్నారని గురువారం ఉదయం శశిధర్‌గౌడ్.. తన ఇద్దరు కూతుళ్లతో చెప్తే వారు నమ్మలేదు. కేటీఆర్ సార్ బర్త్‌డే అయితే మన ఇంటికి ఎందుకు వస్తారు..? అని పిల్లలు శాన్విక, శర్ణిక అన్నారు. తాను నిజమే చెప్తున్నానని శశిధర్‌గౌడ్ తెలిపాడు. కానీ తండ్రి సరదాగా అంటున్నారని భావించిన పిల్లలు.. చూద్దాంలే డాడీ అని అన్నారు. మధ్యాహ్నం తమ ఇంట్లోకి కేటీఆర్ వస్త్తుంటే ఆ చిన్నారుల్లో ఆశ్చర్యం, ఆనందం వెల్లివిరిసింది. తండ్రితో కలిసి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంకుల్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆ చిన్నారులను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. మీరు వస్తున్నారంటే నమ్మలేదని ఆ పిల్లలు గుర్తుచేయ గా.. నేను నిజంగానే వచ్చాను కదా బే టా.. అంటూ కేటీఆర్ నవ్వుతూ పలకరించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శశిధర్‌గౌడ్, ఆయన కుమార్తెలతో కలిసి కేక్ కట్ చేశారు.
శశిధర్‌గౌడ్ తల్లి విజయలక్ష్మి పక్కన కేటీఆర్ కూర్చొని ఆమె ఆరోగ్యం, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు అరెస్టు జరిగిన తీరును విజయలక్ష్మి కేటీఆర్‌కు వివరించారు. ‘మీకు అండగా మన అధినేత కేసీఆర్ ఉంటారు, నేనుంటాను, పార్టీ ఉంటుంది. మీరు భయపడాల్సిందేమీ లేదు. వచ్చేది మన ప్రభుత్వ మే, మీకు అన్ని విధాలుగా అండగా నిలు స్తాం. బాధపడొద్దు.. ఏ సమస్య వచ్చిన నాకు చెప్పండి’ అంటూ భరోసా ఇచ్చా రు. అన్నం తిను బిడ్డా అని ఆమె ఆప్యాయంగా కోరగా కేటీఆర్ భోజనం చేశారు.
మార్చి 15న బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెట్టిన ‘నో విజన్, నో మిషన్, ఓన్లీ 20 పర్సంట్ కమీషన్’ అనే ట్వీట్‌కు మద్దతుగా రీట్వీట్ చేశాను. ఆ తర్వాత మార్చి 16న కరీంనగర్, గోదావరిఖని, రామగుండంలో మూడుచోట్ల పోలీసులు నాపై కేసులు నమోదు చేశారు. జూన్ 29న ఇంద్రేశంలోని నా ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో అరెస్టు చేసి తీసుకెళ్లారు. జైలు జీవితంలో నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ధైర్యంతో భయపడకుండా ఉన్నాను. బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి.
శశిధర్‌గౌడ్ జైలులో ఉన్నప్పుడు ఈ నెల 7న ఆయన చిన్నకూతురు శర్ణిక పుట్టిన రోజు వచ్చింది. తండ్రి జైలులో ఉండటంతో ఆ చిన్నారి పుట్టిన రోజును జరుపుకోలేదు. ఆ విషయం తెలుసుకున్న కేటీఆర్.. శర్ణికకు, ఆమె అక్క శాన్వికకు బర్త్ డే గిఫ్ట్ అందజేశారు. చిన్నారుల్లో ఆనందం నింపారు. కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ బహూకరించారు. స్వయంగా కేటీఆర్ గిఫ్ట్ ఇవ్వడం ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది.