ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించిండు. మేఘాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నడు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీసిండు.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై విజిలెన్స్ రిపోర్టును బయటపెట్టకపోవడానికి మేఘా కృష్ణారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు ముడిపెట్టి దాయడం విడ్డూరంగా ఉన్నదని శనివారం ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హకు చట్టం కింద ఇవ్వకుండా తొకిపెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడంలో కారణమేమిటని ప్రశ్నించారు. మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి రూ.80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని, హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చే సంకల్పానికి గండిపడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సరారు జంకుతున్నదని మండిపడ్డారు. సమాచారాన్ని దాయడమంటే తప్పును ఒప్పుకొన్నట్టేనని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఎద్దేవాచేశారు. తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. ఇప్పటికైనా సమాచార హకు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.