హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ అవినీతిని ఆధారాలతో నిలదీసినందుకే తమ పార్టీ నేత మన్నె క్రిశాంక్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ పిరికివాడిలా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో నిలబడి రాజ్యాంగ పరిరక్షణ గురించి గొప్పగా ఉపన్యాసాలిచ్చే రాహుల్, తెలంగాణలో మాత్రం తన తొత్తు రేవంత్‌రెడ్డి ద్వారా అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొకుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఓటు చోరీ’ అంటూ గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ, తెలంగాణలో ఓటుకు నోటు కేసు సూత్రధారికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఎవరిపైనైనా నిరాధార ఆరోపణలు చేయొచ్చు కానీ, ఆధారాలతో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన క్రిశాంక్‌ను జైలుకు పంపుతారా? అని నిలదీశారు. ఇప్పటికైనా తన కీలుబొమ్మ రేవంత్‌ను అదుపులో పెట్టుకోవాలని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఇకనైనా ఆపాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.
రాహుల్ గాంధీకి రేవంత్‌రెడ్డి అన్ లిమిటెడ్ ఏటీఎంలా మారారని కేటీఆర్ దెప్పిపొడిచారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్ని కేసులు నమోదు చేసినా తాము భయపడేది లేదని తెల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ నిరంతరం బట్టబయలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు.