యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పినట్టే చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్‌కు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినా అధికార దుర్వినియోగం చేసి ఓడించారని, ఎన్నికల వివాదాలను కోర్టులో తేల్చుకుంటామని, క్యాడర్‌కు అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. జనవరిలో పార్టీ సభ్వత్వాలు, పూర్తిస్థాయి కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించారు.
బీఆర్ఎస్ క్యాడర్ కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కమీషన్లు వచ్చే పథకాలకే నిధులు ఇస్తున్నదని ఆరోపించారు. మూసీ సుందరీకరణను అడ్డుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.4వేల కోట్లతో 36 ఎస్టీపీలను కట్టి.. వంద శాతం సీవరేజీ చేసిన ఘనత కేసీఆర్‌ది అని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే 16వేల కోట్లతో మూసీ శుద్ధి చేయొచ్చని, కానీ సుందరీకరణ పేరుతో చేస్తున్న రూ.1.50 లక్షల కోట్ల దోపిడీని మాత్రం అడ్డుకుంటుంటే మూసీని ఆపుతున్నామని బద్నాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయం అత్యంత గలీజుగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో వికృత చేష్టలు, అరాచకాలు, దమనకాండ చూశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు మల్లయ్య యాదవ్‌పై రాళ్లతో దాడి చేసి చంపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బెదిరింపులకు లెక్కే లేదని, తిప్పర్తిలో యాదగిరి అనే బీఆర్ఎస్ నేతను నామినేషన్ వేయకుండా బెదిరించి కొట్టారని, అయినా వినలేదని కిడ్నాప్ చేసి, అక్కడి మంత్రి బలుపు, అండతో మూత్రం తాగించి అవమానించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. నకిరేకల్‌లోని చినకాపర్తిలో బీఆర్ఎస్కు పడిన ఓట్లను మోరిలో పడేశారని కేటీఆర్ గుర్తుచేశారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురం, తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరుగలేదని ఆయన గుర్తుచేశారు.

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నదని, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసానిచ్చారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యం. పింఛన్లు ఆపుతమని బెదిరిస్తున్నరు. ఇవేమీ మీ అబ్బసొత్తో.. అయ్యజాగీరో కాదు. అవి ప్రజల హక్కులు. ఇది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం సర్పంచ్‌లకు ఉన్న అధికారాల ముందు ఏ ఎమ్మెల్యే ఆటలు సాగవు. ఎమ్మెల్యేల దగ్గర్నే నిధులు లేవు. సర్పంచ్‌లకు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తరు? ఎమ్మెల్యేలే ఆగమాగం ఉన్నారని, వాళ్లతో అయ్యేది కాదు పొయ్యేది కాదు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కేసీఆర్ చావునోట్లో తలపెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అందుకే టీపీసీసీ, టీబీజేపీ అనే పదవులు పుట్టుకొచ్చాయి. దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం. అందుకోసం అంతా కంకణబద్ధులమై కొట్లాడుదాం. కేసీఆర్‌ను గెలిపించే వరకు పోరాడాలి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో బీఆర్ఎస్కు పూర్వవైభవం ఖాయం. పార్టీ బీ ఫామ్‌పై జరిగే పరిషత్ ఎన్నికల్లో కారు గుర్తుకు తిరుగులేని విజయం అందించాలి. జనవరిలో పార్టీ సభ్వత్వాలు, పూర్తిస్థాయి కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం.
– కేటీఆర్
కరోనా సమయంలో రూపాయి ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని కేటీఆర్ గుర్తుచేశారు. హామీలపై ప్రశ్నిస్తే అప్పులు అంటూ కల్లిబొల్లి మాటలు చెప్తున్నారని, ఒక మంత్రి ఆరు లక్షల కోట్ల అప్పు ఉందని, మరొకాయన 7లక్షలు అంటారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం ఆవిర్భవించే నాటికి 72వేల కోట్లు అప్పు ఉన్నదని ఆర్బీఐ, కాగ్ లెక్కలు చెబుతున్నాయని, 2023 డిసెంబర్లో కేసీఆర్ దిగిపోయే నాటికి 3.50లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉన్నదని కేటీఆర్ వివరించారు. ఈ నిధులతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేశామని, పదేండ్ల కిందట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని, ఇప్పుడు మూడు నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లేదని, 39వేల కోట్లు భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగాకేంద్రాన్ని స్థాపించామని పేర్కొన్నారు. రూ.1800 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. మంచినీటి పథకం కోసం రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథను అమలు చేశామని చెప్పారు. కాళేశ్వరంతో 40లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు అందించామన్నారు. 11 సీజన్లలో 73వేల కోట్ల రైతుబంధు డబ్బులు జమ చేశామని తెలిపారు. ఫ్లోరోసిస్‌తో తల్లడిల్లిన మునుగోడు, దేవరకొండల్లో ఇంటింటికీ నల్లా నీటితో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టామని, 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
దేశ జనాభాలో 3శాతం ఉన్నా దేశంలోనే 30శాతం పంచాయతీ అవార్డులు దక్కించుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. పల్లెల్లో నర్సరీలు, ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేశామని, హరితహారం కింద 270 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. ఎకరాకు 15వేలు ఇస్తామంటే నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే, రేవంత్‌రెడ్డి రెండు సీజన్లు రైతు భరోసా ఎగ్గొట్టాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడపించడం సీఎం రేవంత్‌రెడ్డికి చేతకాదని విమర్శించారు. కాంగ్రెసోళ్లు కల్యాణలక్ష్మీతోపాటు తులం బంగారం ఇచ్చుడు దేవుడెరుడు అని, మెడలో ఉన్న పుస్తెలతాడును కూడా ఎత్తుకుపోతరని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గులేదు. పార్టీ మారానని స్వయంగా స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరే చెప్పారు. స్పీకర్‌కు ఇవేవీ కనిపించడం లేదా? గలీజు రాజకీయాలు చేస్తున్నరు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితి. 70 ఏండ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి పంచన చేరి నాశనం చేసుకున్నరు. గబ్బిలాలు సూరు పట్టుకొని వేలాడినట్టుంది వీరి పరిస్థితి. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? కడియం కమిట్మెంట్.. కాకరకాయ ముచ్చట్లు చెప్తరు.
-కేటీఆర్
రెండేండ్లుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు సహకరిస్తున్న పోలీసుల చరిత్రను పింక్ బుక్‌లో రాస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరి పైనా అక్రమ కేసులు బనాయించలేదని చెప్పారు. ఎన్నికల్లో పోలీసుల అరాచకాలు ఎక్కువయ్యాయని, ఎస్ఐ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, సీఐ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని, ఎన్నికలు యుద్ధంలా మారాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, అధికారులు, పోలీసులపై బీఆర్ఎస్ సైనికులు పోరాడి సర్పంచ్‌లుగా గెలువడం గొప్ప విషయమని చెప్పారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రానున్నారని, అప్పుడు వీరి లెక్కలు సరిచేద్దామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు క్యామ మల్లేశ్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, పల్లె రవి, తుంగబాలు, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.