KTR | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : కొత్త జిల్లాలు ఆవిర్భవించి అక్టోబర్ 11 నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 10, 11 తేదీల్లో ఆవిర్భావ దశాబ్ది సంబురాలను అట్టహాసంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల చిరకాల కలను సాకారం చేసిన కేసీఆర్ ఘనతను తెలంగాణ ప్రజలకు విడమరచి చెప్పాలని గులాబీ శ్రేణులను కోరారు. గురువారం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేడుకలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన కేసీఆర్ పాలనాసంస్కరణలకు శ్రీకారం చుట్టి పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చి ప్రజల చిరకాల కలను సాకారం చేశారని గుర్తుచేశారు. జిల్లాల ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులను ప్రజలకు చేరువ చేసేందుకే కేసీఆర్ మహత్తర నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ అరుదైన సందర్భంలో వికేంద్రీకరణ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఉద్బో ధించారు. ‘మనం అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, జిల్లాలు శాశ్వతం.
తెలంగాణలో అధికార వికేంద్రీకరణ, పాల నా సంస్కరణల ద్వారా ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాలు.. వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గుర్తుచేయాల్సిన గురుతర బాధ్యత మ నందరిపై ఉన్నది’ అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో దశాబ్దాలుగా ప్రజల కన్న కలలు నెరవేరాయని పునరుద్ఘాటించారు. జిల్లాకేం ద్రాలకు వెళ్లేందుకు గతంలో 100-150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఆ పరిస్థితి మారిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో మౌలిక వసతులు వచ్చాయని, అద్భుతమైన కలెక్టరే ట్లు రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు. శాంతిభద్రతల పర్యవేక్షణ పెరిగి, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని తెలిపారు.
కొత్త జిల్లాల దశాబ్ది సంబురాల్లో భాగంగా అన్ని జిల్లాకేంద్రాల్లో చేపట్టాల్సిన పలు ప్రత్యేక కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు.