హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): అమెరికాలో కన్నుమూసిన తం డ్రిని కడసారి చూడటానికి వెళ్లేందుకు అత్యవసర వీసా జారీకి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు తనవంతుగా సహకరించారు. యూఎస్ఏలో ఉం టున్న శ్రీనివాసరావు అన్నంగి ఈ నెల ఆరో తేదీన చనిపోయారు. 12న అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, తన సోదరీమణులు హేమలత, బాలత్రిపుర సుందరి వచ్చేందుకు అత్యవసర వీసాకు దరఖాస్తు చేసుకొన్నారని కేటీఆర్కు వెంకట్ అన్నంగి ట్విట్టర్లో తెలిపారు. వీసా త్వరగా వచ్చేందుకు సహకరించాలని కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్.. అత్యవసర వీసా జారీకి దయచేసి సహకరించాలంటూ యూఎస్ కౌన్సిల్ జనరల్ హైదరాబాద్కు ట్వీట్ చేశారు.
సోదరుడి ఆచూకీ తెలిసేందుకు సాయం చేయండి
‘డియర్ కేటీఆర్ సార్.. వరంగల్ జిల్లాకు చెందిన నా సోదరుడు కడారి అఖిల్.. జర్మనీ మాగ్డేబర్గ్లోని ఒట్టోవాన్ గురికే యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అక్కడ నదిలో గల్లంతై 24 గంటలైంది. ఇప్పటి వరకు సమాచారం లేదు. దయచేసి సాయం చేయండి’ అని రసజ్ఞ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. జర్మనీలోని అధికారులతో మాట్లాడుతామని, అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన బృందం తెలియజేస్తుందని ట్వీట్ చేశారు