సుల్తాన్‌బజార్, మే 5: పుట్టుకతోనే స్వరపేటికలో పొరలు ఏర్పడటంతో శ్వాస సంబంధ సమస్యలు.. మాటలు రాక సతమతమవుతున్న చిన్నారికి కోఠి ఈఎన్టీ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి, రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో కార్పొరేట్తరహా అధునాతన వైద్యం అందుతున్నదని నిరూపించారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌కు చెందిన కే చంటి కూతురు లహరిప్రియ (7) పుట్టుకతోనే శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నది.
లహరి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కోఠిఈఎన్టీ వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రొఫెసర్ డాక్టర్ సంపత్‌కుమార్‌సింగ్ నేతృత్వంలోని వైద్య బృందం అధునాతన ప్రక్రియ (ట్రాకియాస్టమీ) ద్వారా క్లాటేషన్ సర్జరీ చేసి ముక్కు ద్వారానే శ్వాస తీసుకొనేలా చేశారు. సర్జరీ విజయవంతం కావడంతో చిన్నారి అందరిలా మాట్లాడగలుగుతున్నది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కోఠి ఈఎన్టీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవంతంగా సర్జరీ నిర్వహించిన వైద్యుల బృందాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్ శుక్రవారం అభినందించారు.