హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతులు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, ఒక్క ఏడాదిలోనే 620 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా మళ్లీ సమైక్య రాష్ట్రంనాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, మరోవైపు ఏదో సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నదని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ హామీనీ అమలుచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో రైతు ఏ కారణంతో చనిపోయినా రూ.5 లక్షల రైతు బీమా మొత్తం వచ్చేదని, ప్రస్తుతం ఆ రైతు బీమా కూడా రావడం లేదని మండిపడ్డారు.‘రైతు రుణమాఫీ సరిగా జరగలేదని, రైతు భరోసా ఇవ్వడమే లేదని, సాగునీటి సదుపాయాలు కుంటుపడ్డాయని మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వబోమని ప్రభుత్వం, మంత్రులు రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఐదు లక్షల క్వింటాళ్ల సన్న వడ్లకు మాత్రమే రూ.25 కోట్ల బోనస్ ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు.
ఎన్నికల ముందు పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలుపై జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్ పాలకులు ప్రజలను ఇంకా భ్రమల్లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు చెప్తేనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం పెద్దపల్లి పర్యటనను రైతులు, యువకులు అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిలదీయాలని కోరారు. సీఎం పర్యటన పెద్దపల్లికి చీకటి అడుగుగా ఆయన అభివర్ణించారు. ‘యువ వికాసం కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు యువవికాసం కింద ఏ హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పెద్దలకు గుర్తున్నదా? యువకులకు ఏమీ చేయకుండానే యువ వికాసం సంబురాలా? సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు నిర్బంధం అమలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
పెద్దపల్లిలో లక్షా 55 వేల మంది రైతులుండగా, 95 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని కొప్పుల ఈశ్వర్ వివరించారు. పెద్దపల్లికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ రైతులందరికీ ఎందుకు రుణమాఫీ కాలేదో సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతు పండగ చేసుకోవడం చూసి రైతులే నవ్వుకుంటున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సంబురాల పేరుతో వృథా చేస్తున్నారని విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోయినా రేవంత్ సర్కారు చలించడం లేదని మండిపడ్డారు.