హైదరాబాద్, జూలై 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఆఫర్ చేసే బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ డిగ్రీ లేదా పీజీ కోర్సులతో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని గురువారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు.
ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో రాజేంద్రనగర్, మోజెర్ల, మల్యాల, ఉద్నా కళాశాలలతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి అశ్వారావుపేటలోని ఉద్యాన కళాశాలలో మాత్రమే బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ విద్యకు ఉద్యాన వర్సిటీ గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచే కళాశాలలు మినహా రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయం గానీ, కళాశాల గానీ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ డిగ్రీ లేదా కోర్సు ఆఫర్ చేస్తే ఉద్యాన వర్సిటీకి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఇతర విశ్వవిద్యాలయాల కళాశాలలు, డిగ్రీలకు, కోర్సులకు ఉద్యాన వర్సిటీ గుర్తింపు వర్తించదని తెలిపారు.