యాచారం, సెప్టెంబర్ 5 : సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, ఆర్బీతండా, పులిచర్లకుంటతండా, ఈర్లపల్లితండాకు చెందిన పలువురు రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గతంలో యాచారం మండలంలోని అక్కడి బాధిత రైతులు అడ్డుకున్న విధంగానే తాము ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ మేరకు గురువారం రైతులు యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి వెళ్లి అక్కడి ఫార్మాసిటీ బాధిత రైతులు, నాయకులతో సమావేశమయ్యారు. గతంలో యాచారం, కందుకూరు మండలాల్లో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో ఏర్పాటుకు ప్రయత్నించగా.. వారు ఎంచుకున్న ఉద్యమ కార్యాచరణ, అడ్డుకున్న విధానం, నష్టపరిహారం, వ్యతిరేక ఉద్యమాలపై ఆరా తీశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టంచేశారు. గోబ్యాక్ ఫార్మా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా విషం ఏంటని ప్రశ్నించారు. కొడంగల్లో ఫార్మాను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. కొడంగల్ సెగ్మెంట్లో 1,375 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.