Kalpana | మావోయిస్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఉండగా.. అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆమె సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె కల్పన అలియాస్ సుజాతక్క, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్ జార్గ్రామ్లోని బురిషోల్ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. కిషన్ జీ భార్య సుజాతక్క సైతం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ ఎన్కౌంటర్లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. అయితే, ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారని.. పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియరాలేదు. అయితే, వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్ జోన్లో ఉంటున్నారా? అన్న సమాచారం తెలియాల్సి ఉన్నది. ఆమెను ఎప్పుడు.. ఎక్కడ ? అరెస్ట్ చేశారన్న వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉంది. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు.